బాలకృష్ణ మూవీకి.. అనిరుధ్ బాణీలు!
ABN, Publish Date - May 04 , 2026 | 10:08 PM
నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు కట్టనున్నారట. ఈ వార్త విశేషంగా వినిపిస్తోంది. అయితే కొన్నిఅనుమానాలు సైతం పొడసూపుతున్నాయి. అవేంటో !?
నటసింహ బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో యువసుధ ఆర్ట్స్, ఎస్.ఎల్.వి. సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం త్వరలోనే మొదలు కానుంది. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) బాణీలు కట్టనున్నట్టు సమాచారం. ఇంతకు ముందు కొరటాల శివ రూపొందించిన 'దేవర' చిత్రానికి కూడా అనిరుధ్ రవిచందర్ స్వరకల్పన చేశారు. అందువల్లే అనిరుధ్ తోనే సాగాలని కొరటాల శివ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒక్కసారి కథ నచ్చిన తరువాత, ఏ విషయంలోనూ బాలయ్య జోక్యం చేసుకోరని అందరికీ తెలుసు. అదే తీరున ఈ సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకునిగా ఎంచుకున్నానని కొరటాల శివ చెప్పి ఉండవచ్చు. అందువల్లే బాలయ్య ఆ విషయంలో జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది.
తమిళనాట తడాఖా చూపిస్తోన్న అనిరుధ్ రవిచందర్ తెలుగులో అంతగా ఆకట్టుకోలేక పోయారు. అనిరుధ్ స్వరాల్లో రూపొందిన తెలుగు చిత్రాల్లో ఒకే ఒక 'దేవర' బంపర్ హిట్ గా నిలచింది. అనిరుధ్ బాణీల్లో తెరకెక్కిన తెలుగు సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరికొన్ని పరవాలేదనిపించాయి. అంతే తప్ప ఏ నాడూ అదరహో అనే హిట్ ను అందించలేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ లాంటి టాప్ స్టార్ సినిమాకు అనిరుధ్ ట్యూన్స్ అందించడం నిజంగా విశేషమే.
అయితే ఇక్కడే కొన్ని అనుమానాలు పొడసూపుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి దాకా టాలీవుడ్ టాప్ స్టార్స్ నలుగురిలో తొలిసారి బాలయ్య సినిమాకే అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు... అక్కడే కొందరికి డౌట్ కొడుతోంది. ఎందుకంటే అనిరుధ్ తెలుగులో మొట్టమొదట కంపోజ్ చేసిన సినిమా పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'. ఆ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సీనియర్ టాప్ హీరో అయిన బాలకృష్ణకు అనిరుధ్ బాణీలు ఏం చేస్తాయో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న అనిరుధ్ మేకర్స్ కే రూల్స్ పెడుతున్నారు. తాను ముందుగా అంగీకరించిన సినిమాలు పూర్తయ్యాకే తరువాతి చిత్రాల గురించి ఆలోచిస్తానన్నది మొదటిది... సినిమా పూర్తయ్యాకే ఆర్.ఆర్. అందిస్తానన్నది రెండోది. ఇప్పటికే అనిరుధ్ ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య- కొరటాల శివ మూవీ సంక్రాంతి టార్గెట్ చేసుకొని రూపొందనుంది. ఇంత తక్కువ సమయంలో అనిరుధ్ ఆ సినిమాకు న్యాయం చేస్తారా అన్నది మరో అనుమానం.
ఇక బాలయ్య 'అఖండ' మొదలు 'అఖండ-2' దాకా ఐదు చిత్రాలకు తమన్ సంగీతం సమకూర్చారు. అలాగే బాలయ్య 111వ చిత్రంగా రూపొందుతోన్న గోపీచంద్ మలినేని మూవీకి కూడా తమన్ బాణీలు కడుతున్నారు. పైగా 'నందమూరి తమన్' అంటూ ఫ్యాన్స్ ఆయనను అభిమానిస్తారు. అలాంటి తమన్ ఉండగా, ఇప్పుడు అనిరుధ్ తో సాగడంపైనా కొందరు డౌట్ పడుతున్నారు. ఇలా కొన్ని అనుమానాలకూ అనిరుధ్ తావిస్తున్నారు... మరి బాలయ్య-కొరటాల శివ మూవీ ఏ మ్యూజిక్ డైరెక్టర్ బాణీలతో వస్తుందో చూడాలి.