వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌తో అనిల్ కొత్త గేమ్

ABN , Publish Date - Jul 02 , 2026 | 07:13 PM

డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పీడు ఆషామాషీగా లేదని అందరూ అంటున్నారు. అచ్చివచ్చిన హీరో - కలిసొచ్చిన కథానాయకుని కాంబోలో అనిల్ తెరకెక్కిస్తున్న మూవీపై సినీ ఫ్యాన్స్ లో భలే డిస్కషన్స్ సాగుతున్నాయి.

అనిల్ రావిపూడి ఇప్పటి దాకా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మహేశ్, రవితేజ, కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఎందరితో సినిమాలు తీసినా, ఆయనకు కళ్యాణ్ రామ్ ఓ స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే అనిల్ ను దర్శకునిగా పరిచయం చేసిందే కళ్యాణ్ రామ్. అనిల్ తొలి సినిమా 'పటాస్'లో నటించి ఆ చిత్రాన్ని నిర్మించారు కళ్యాణ్ రామ్. ఈ మూవీలోనే కళ్యాణ్ రామ్ తో భలేగా కామెడీ పండించారు అనిల్. అలా కళ్యాణ్- అనిల్ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు తనకు అచ్చివచ్చిన వెంకటేశ్, కలిసొచ్చిన కళ్యాణ్ రామ్ ను కలిపి సినిమా తీస్తున్నారు అనిల్. దాంతో మరింత స్సెషల్ గా ఈ మూవీ ఉండబోతోందని టాక్. అలా అనౌన్స్ చేసేసి, ఇలా సినిమాను పట్టాలెక్కించేశారు అనిల్. జూలై 5న కళ్యాణ్ రామ్ బర్త్ డే. ఈ లోగా ఈ మూవీకి సంబంధించిన కళ్యాణ్ రామ్ గెటప్ ను కానీ, గ్లింప్స్ కానీ బర్త్ డే గిఫ్ట్ గా రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అనిల్ రావిపూడికి జనవరి నెల బాగా కలసి వస్తుందని చెప్పొచ్చు. ఆయన తొలి సినిమా 'పటాస్' 2015 జనవరి 23న రిలీజయింది. మంచి విజయం సాధించింది. 2019 జనవరి 12న తన తొలి సంక్రాంతి చిత్రంగా 'ఎఫ్-2' ను రిలీజ్ చేశారు అనిల్. వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా హిట్ అయింది. 2020 జనవరి 11న మహేశ్ బాబుతో తీసిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో రెండోసారి సంక్రాంతి బరిలో దూకారు అనిల్. ఈ మూవీ బంపర్ హిట్ అనిపించుకుంది. 2025 జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం'తో మూడోసారి పొంగల్ బరిలో హంగామా చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. ఈ యేడాది జనవరి 12న చిరంజీవితో తెరకెక్కించిన 'మన శంకరవరప్రసాద్ గారు' రిలీజ్ చేశారు. చిరు సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలచిందీ చిత్రం. ఇలా జనవరి మాసం, అందునా సంక్రాంతి సీజన్ లో అదరహో అనిపించారు అనిల్. ఇప్పుడు వెంకటేశ్, కళ్యాణ్ రామ్ తో తెరకెక్కిస్తున్న తాజా చిత్రాన్ని 2027 జనవరి 13న భోగి రోజున రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని టాక్. ఇదే జరిగితే జనవరి 11, 12, 13, 14 తేదీల్లో విజయాలను చూసిన క్రెడిట్ అనిల్ దక్కించుకుంటారని సినీ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇప్పటికే 2025 సంక్రాంతికి, 2026 పొంగల్ కు బంపర్ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి రాబోయే భోగి పండుగకూ హిట్ కొట్టారంటే ఈ సీజన్ లో 'హ్యాట్రిక్' కొట్టిన డైరెక్టర్ గానూ అనిల్ రావిపూడి నిలచిపోతారు. ఈ సినిమాకు కూడా టైటిల్ లో 'సంక్రాంతి' వచ్చేలా పేరు పెడతారనీ భావిస్తున్నారు. ఈ మూవీ ఎలా ఉన్నా ఖచ్చితంగా వంద కోట్లు చూస్తుందనీ కొందరు విశ్వసిస్తున్నారు. ఇలా అనిల్ రాబోయే సినిమా ఆయనకు ఎలాంటి రికార్డ్ ను సొంతం చేస్తుందో చూడాలని ఆసక్తిగా ఉన్నారు సినీజనం. మరి అనిల్ ఆ సినిమాతో ఏ తీరున సందడి సాగిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం ప్రారంభం.. హీరో ఎవరంటే

దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె పెళ్లిలో చిరు, వెంకీ, పవన్ సందడి

వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు

Updated Date - Jul 02 , 2026 | 07:57 PM