సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అయ్యా.. అయ్యా.. అనిల్ ఇదెక్క‌డి రాకెట్ స్పీడ్

ABN, Publish Date - Jul 24 , 2026 | 08:31 AM

ఇప్పటి జనరేషన్‌లో ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమా తీయాలంటే ఎంత సమయం పడుతుంది..? రెండేళ్లు.. లేదా మూడేళ్లు! ఇది హీరోలకే కాదు, అభిమానులకు కూడా అలవాటైపోయింది.

Victory Venkatesh, anil ravipudi

ఇప్పటివరకు దర్శకుడిగా అనిల్ రావిపూడి ఖాతాలో ఏకంగా 9 సినిమాలు పడితే, ఆ తొమ్మిదికి తొమ్మిదీ బ్లాక్‌బస్టర్ విజయాలను నమోదు చేయడం ఒక అరుదైన రికార్డు. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ఫాస్ట్ మేకింగ్.. ఇదే ఆయన సక్సెస్ సీక్రెట్. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్‌తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించిందో మనం చూశాం. అంతేకాదు, మెగాస్టార్‌తో ఆయన తెరకెక్కించిన మన శంకర వరప్రసాద్ మూవీ టాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఒక పక్క వినోదాన్ని పండిస్తూనే, ఇంకో పక్క భారీ వసూళ్లను సాధించడంలో అనిల్ రావిపూడి రూటే వేరు.

ఇక ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు అనిల్. ఈసారి విక్టరీ వెంకటేష్ (Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (kalyan ram) కాంబినేషన్‌లో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపుదిద్దుతున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ కాగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అసలు అసలైన మ్యాజిక్ ఎక్కడ ఉందంటే.. ఇటీవలే చాలా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, అప్పుడే తన ఫస్ట్ షెడ్యూల్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ అఫీషియల్ వీడియో రూపంలో అనౌన్స్ చేయడంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంత స్పీడ్ ఏంటి సామి అని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఒకే ఒక్క స్టార్ హీరోతో సినిమా తీయడమే ఒకెత్తయితే, ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాను మేనేజ్ చేయడం మరో ఎత్తు! కానీ ఈ విషయంలో అనిల్ రావిపూడి అందరికన్నా పది అడుగులు ముందే ఉన్నారు. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లోనే వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో పాటు ఇద్దరు క్రేజీ హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొనడం విశేషం. ఇంత భారీ స్టార్ క్యాస్టింగ్‌ను సెట్స్ మీద ఒకేసారి హ్యాండిల్ చేస్తూ, క్వాలిటీ తగ్గకుండా పక్కా ప్లానింగ్‌తో పనులు పూర్తి చేయడం అనిల్ రావిపూడికే సాధ్యమైంది.

గతంలో మన శంకర వరప్రసాద్ చిత్రాన్ని కూడా ఇదే తరహా రాకెట్ స్పీడ్‌లో పూర్తి చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు వెంకీ - కళ్యాణ్ రామ్‌ల సినిమాను కూడా అదే స్థాయిలో ఫినిష్ చేసి, వచ్చే సంక్రాంతి బరిలో దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే బిజినెస్ పరంగా కూడా భారీ క్రేజ్ సొంతం చేసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓటీటీ, థియేట్రికల్ హక్కులను జీ 5 సంస్థ సొంతం చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. పక్కా స్క్రిప్ట్, వేగవంతమైన మేకింగ్, మైండ్ బ్లోయింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి తన సొంత రికార్డులను తానే బ్రేక్ చేస్తారేమో చూడాలి.

Updated Date - Jul 24 , 2026 | 08:31 AM