NBK - Anil: మళ్లీ కలవబోతున్న బాలకృష్ణ- అనిల్ కాంబో?
ABN, Publish Date - Jul 14 , 2026 | 12:51 PM
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో తీసిన 'మన శంకరవరప్రసాద్' చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు.
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో తీసిన 'మన శంకరవరప్రసాద్' చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ భారీ విజయం తర్వాత అనిల్ రావిపూడి తన మొదటి సినిమా హీరో నందమూరి కళ్యాణ్ రామ్, విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నారనే దానిపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది.
ఆ క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. అనిల్ రావిపూడి త్వరలోనే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో ఒక భారీ సినిమా చేయనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'భగవంత్ కేసరి' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2023లో విడుదలైన ఆ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు మరోసారి బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అటు నందమూరి అభిమానుల్లో, ఇటు సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'NBK 111' షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో సాగుతోంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'వీరసింహారెడ్డి' హిట్ కావడంతో ఈ కొత్త సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు. ఇటీవల ఈ మూవీ అధికారికంగా ప్రారంభమైంది. మొదటిసారి బాలయ్య-కొరటాల శివ కాంబినేషన్ సెట్ కావడంతో టాలీవుడ్‌లో దీనిపై తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఈ రెండు భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. అటు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ కూడా పూర్తికావాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వీటిని కేవలం పుకార్లుగానే భావించాలి. ఏదేమైనప్పటికీ, మాస్ పల్స్ తెలిసిన అనిల్ రావిపూడి, నటసింహం బాలకృష్ణతో సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.