సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనిల్ పెన్నుకు తారక్ మాస్ తోడైతే...

ABN, Publish Date - Nov 23 , 2026 | 05:23 PM

'హిట్ మిషన్' గా సాగుతోన్న అనిల్ రావిపూడి ఇప్పటికి తొమ్మిది సినిమాలతో జనాన్ని అలరించారు. అనిల్ పదో చిత్రంగా 'జనవరి 12 విడుదల' వస్తోంది. దీంతో అనిల్ రాబోయే చిత్రం ఎలా సందడి చేస్తారోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో సేఫ్ ప్రాజెక్ట్స్ అందివ్వగల డైరెక్టర్ ఎవరంటే అనిల్ రావిపూడి పేరే వినిపిస్తోంది. ఇప్పటి దాకా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తొమ్మిది చిత్రాలు నిర్మాతలకు లాభాలు తెచ్చినవే కావడం విశేషం. మొదటి సినిమా 'పటాస్' మొదలు మొన్న వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' దాకా అనిల్ సినిమాలు జనాన్ని భలేగా అలరించాయి. అనిల్ పదో చిత్రంగా 'జనవరి 12 విడుదల' జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ ను కూడా అనిల్ వైవిధ్యంగా రూపొందించడం జనాన్ని ఆకట్టుకుంటోంది. తాజాగా 'జనవరి 12 విడుదల' నుండి రిలీజైన 'డివికి డివికి డిక్కుమ్ డిక్కుమ్' లిరికల్ కుర్రాళ్ళను కిర్రెక్కిస్తోంది. ఈ సినిమా రిలీజయ్యాక యన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కనుంది. దాంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా అనిల్ రాబోయే 'జనవరి 12 విడుదల' వైపు చూస్తున్నారు.


అనిల్ రావిపూడికి, సంక్రాంతి సంబరాలకు భలేగా జోడీ కుదిరింది. అనిల్ ఇప్పటి దాకా రిలీజ్ చేసిన పొంగల్ మూవీస్ అన్నీ బంపర్ హిట్స్ గా నిలిచాయి. అనిల్ దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్-2', 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకరవర ప్రసాద్ గారు' చిత్రాలు పొంగల్ బరిలోనే దూకి భలేగా సందడి చేశాయి. 2020 సంక్రాంతికి మినహాయిస్తే మిగిలిన మూడు సార్లు అనిల్ రావిపూడి సినిమాలే సంక్రాంతి సంబరాల్లో టాప్ గ్రాసర్స్ గా నిలవడం విశేషం. అందువల్ల రాబోయే 'జనవరి 12 విడుదల' కూడా అదే రూటులో సాగుతుందని సినీఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

నందమూరి హీరోలతో అనిల్ రావిపూడి అనుబంధం కూడా ప్రత్యేకమైనదే. నందమూరి కళ్యాణ్ రామ్ నటించి, నిర్మించిన 'పటాస్' చిత్రంతోనే అనిల్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఇక ఇప్పటి దాకా అనిల్ తెరకెక్కించిన అన్ని చిత్రాల్లోనూ కామెడీయే డామినేట్ చేసింది. అయితే ఒకే ఒక్క 'భగవంత్ కేసరి'లో బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని మరీ రక్తి కట్టించారు అనిల్. అలాగే ఆ సినిమా సైతం అనిల్ చిత్రాల్లో ప్రత్యేకంగా నిలుస్తూ, జాతీయ స్థాయిలో ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా నిలచింది. ఇలా నందమూరి హీరోస్ తో అనుబంధం ఉన్న అనిల్ తొలిసారి యన్టీఆర్ తో ఓ సినిమా రూపొందించబోతున్నారు. కాబట్టి ఆ మూవీ సైతం ఓ స్పెషల్ కాగలదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాబోయే పొంగల్ లో అనిల్ సినిమా ఎలా సందడి చేస్తుందో? తరువాత యన్టీఆర్ మూవీని ఎలా తెరకెక్కిస్తారో? అన్న ఆసక్తి అభిమానుల్లో చోటు చేసుకుంది. మరి యన్టీఆర్- అనిల్ కాంబో ప్రాజెక్ట్ ఎప్పుడు ఎలా పట్టాలెక్కుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఆ దర్శకుడితో ఫహాద్ ఫాజిల్ క్రేజీ ప్రాజెక్ట్.. బిగ్ సర్‌ప్రైజ్ ఎప్పుడంటే

సంక్రాంతి పరీక్ష.. కృతి కెరీర్ మలుపు తిరుగుతుందా..

నాకు లైఫ్‌ ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీనే..: రకుల్

Updated Date - Nov 23 , 2026 | 05:36 PM