టాక్సిక్ నిర్మాతతో.. అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్
ABN, Publish Date - Mar 11 , 2026 | 05:03 PM
వరుస విజయాలతో సాగిపోతోన్న అనిల్ రావిపూడి రూటు మార్చారని టాక్.. కితకితలు పెడుతూ కలెక్షన్ల వర్షాలు కురిపించిన అనిల్ రావిపూడి - ఇప్పుడు తన స్టైల్ కు భిన్నంగా పయనించబోతున్నారట.
ప్రస్తుతం తెలుగునాట సక్సెస్ రూటులో సాగుతూ సందడి చేస్తోన్న డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి (Anil Ravipudi) జేజేలు అందుకుంటున్నారు. ప్లానింగ్ ప్రకారం అనుకున్న బడ్జెట్‌లో మూవీస్ రూపొందించి నిర్మాతలకు లాభాలు చూపించడంలో అనిల్ రావిపూడి మేటి అనిపించుకున్నారు. ఆయనతో సినిమాలు నిర్మించడానికి పలువురు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే అనిల్ మాత్రం కేవీయన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణకు ఓ సినిమా తీయడానికి సిద్ధమయ్యారు.
ఇందులో హీరోహీరోయిన్లు ఎవరు అన్న అంశానికి తావులేదు. ఎందుకంటే అనిల్ డైరెక్షన్ లో కేవీయన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మించేది యానిమేషన్ మూవీ అట!. ఇప్పటి దాకా ఫార్ములా మూవీస్ తో కామెడీని కనెక్ట్ చేస్తూ సక్సెస్ చూశారు అనిల్. తనలోని మేకర్ కు తానే పరీక్ష పెట్టుకుంటూ మరో రూటులో సాగడానికి అనిల్ సిద్ధం కావడం విశేషంగా మారింది.
అనిల్ రావిపూడి ఇప్పటికే వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్ బాబు వంటి టాప్ స్టార్స్ తో బంపర్ హిట్స్ పట్టేశారు అనిల్ రావిపూడి. ఇక ఆయన చిత్రాల ద్వారా కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటివారు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.
అలా తన హీరోలందరికీ సక్సెస్ చూపిన అనిల్ రావిపూడి తరువాతి చిత్రం వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబోలో తెరకెక్కనుందని విశేషంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అనిల్ యానిమేషన్ బాట పట్టడం కూడా విశేషంగా మారింది. ఓ వైపు తన రెగ్యులర్ ఫార్ములా మూవీస్‌తో సాగుతూనే మరోవైపు తాను అనుకున్న సబ్జెక్ట్ తో అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది.
అనిల్ రావిపూడి అసలు 'మన శంకర వరప్రసాద్ గారు' మేకింగ్ లో ఉండగానే యానిమేషన్ మూవీకి సంబంధించిన అన్ని అంశాలు పూర్తి చేశారట. ప్రస్తుతం యానిమేషన్ సినిమాలోని కేరెక్టర్స్‌ను డిజైన్ చేస్తున్నారని టాక్. ఎంత లేదన్నా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో రెండేళ్ళు పడుతుందని వినిపిస్తోంది. అందువల్ల ఓ వైపు యానిమేషన్ మూవీని రూపొందిస్తూనే మరోవైపు కమర్షియల్ మూవీస్ తో అనిల్ సాగనున్నారని తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ యానిమేషన్ మూవీ అనిల్ కెరీర్‌లో మరో మైల్ స్టోన్‌గా నిలుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి దాకా రెగ్యులర్ ఫార్ములాతో సాగిన అనిల్ యానిమేషన్ మూవీ కోసం టెక్నాలజీనీ ఫాలో అవుతారని తెలుస్తోంది. మరి ఈ యానిమేషన్ మూవీ ఎప్పుడు జనం ముందు నిలుస్తుందో చూడాలి. ఇదిలాఉంటే.. అనిల్ యానిమేషన్ సినిమా విషయంలో మరో వార్త కూడా వైరల్ అవుతోంది.
అసలు అనిల్ యానిమేషన్ సినిమా అనేది ఏమీ చేయడం లేదని, అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమేనని అంటున్నారు. కాకపోతే కేవీఎన్ ప్రొడక్షన్స్ తెలుగులో పలువురు ప్రముఖ దర్శకులు, నటులకు అడ్వాన్సులు ఇప్పటికే ఇచ్చిందని అందులో అనిల్ రావిపూడి కూడా ఉన్నారని స్పష్టం చేస్తున్నారు. అయితే.. అది కూడా స్ట్రెయిట్ చిత్రం కోసమేనని ఇందుకు సంబంధించిన వివరాలు అతి త్వరలోనే ప్రకటిస్తారని చెప్పుకొస్తున్నారు.
అయితే ఈ రెండు వార్తలను బట్టి కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో అనిల్ రావిపూడి సినిమా పక్కా ఉంటుందని తెలుస్తుండగా, అది స్ట్రెయిటా లేక యానిమేషనా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటి వరకు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని అనిల్ టీం కోరినట్లు సినీ వర్గాల్లో వినబడుతోంది.