Anil Ravipudi: జన నాయకుడు.. విజయ్ నన్నే చేయమన్నాడు
ABN, Publish Date - Jan 11 , 2026 | 04:27 PM
టాలీవుడ్ లో పరాజయమే ఎరుగని దర్శకుల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒకరు. పటాస్ దగ్గర నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు విజయాలను మాత్రమే అందుకున్నాడు.
Anil Ravipudi: టాలీవుడ్ లో పరాజయమే ఎరుగని దర్శకుల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒకరు. పటాస్ దగ్గర నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు విజయాలను మాత్రమే అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆ విజయ పరంపరను కొనసాగించడానికి మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమాతో రాబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ కూడా క్రియేట్ అయ్యింది.
ఇక మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అనిల్ రావిపూడి.. విజయ్ జన నాయకుడు సినిమా గురించి మాట్లాడాడు. అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గానే జన నాయకుడు తెరకెక్కింది. కోలీవుడ్ నేటివిటీకి తగ్గట్లు ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇక అన్ని బావుండి ఉంటే జన నాయకుడు రిలీజ్ అయ్యి మూడు రోజులు అయ్యేది. కానీ, సెన్సార్ సమస్యల వలన ఈ సినిమా వాయిదా పడింది.
తాజాగా భగవంత్ కేసరి సినిమానే జన నాయకుడుగా తెరకెక్కించారు.. దానిపై మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ' కచ్చితంగా విజయ్ చివరి చిత్రం ఎప్పుడు వచ్చినా రికార్డులు షేక్ అవుతాయి. మొదట.. విజయ్ ఈ సినిమాకు నన్నే డైరెక్ట్ చేయమని అడిగాడు. కానీ, నేను ఏదైనా స్ట్రెయిట్ సబ్జెక్టు చేస్తానని చెప్పాను. అంటే పర్సనల్ గా విజయ్ చివరి చిత్రం.. రీమేక్ అంటే ఎలా ఉంటుందో అని భయపడ్డాను. అందుకని నేను ధైర్యం చేయలేదు. విజయ్ కి మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. కొన్ని ఎలిమెంట్స్ బాగా బాగా నచ్చాయి. అందుకే ఆయన పట్టుబట్టి చేశారు. చాలామంది రీమేక్ ఎందుకు అన్నా కూడా ఏదో ఉందని నమ్మాడు. విజయ్ యాక్టింగ్ సినిమాకు మరింత బలం అవుతుంది' అని చెప్పుకొచ్చాడు.