వారణాసి తరువాత అనిల్ తో మహేష్.. ఎలా నమ్మారు
ABN, Publish Date - Aug 25 , 2026 | 10:11 PM
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న భారీ పౌరాణిక అడ్వెంచర్ చిత్రం వారణాసి (Varanasi). ఈ సినిమా ఇంకా పూర్తి కూడా కాలేదు. అప్పుడే మహేష్ బాబు తదుపరి సినిమాపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో మహేష్ బాబు (Mahesh Babu) చేస్తున్న భారీ పౌరాణిక అడ్వెంచర్ చిత్రం వారణాసి (Varanasi). ఈ సినిమా ఇంకా పూర్తి కూడా కాలేదు. అప్పుడే మహేష్ బాబు తదుపరి సినిమాపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎప్పటినుంచో వారణాసి తరువాత మహేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరి కలయికలో సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ హిట్ సినిమా వచ్చింది. దీంతో మహేష్ కచ్చితంగా రెండో సినిమా ఒప్పుకున్నాడేమో అనుకున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని, వారణాసి రిలీజ్ కి ముందే ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో అనిల్- మహేష్ ఉన్నారని వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ వార్తలను అనిల్ రావిపూడి ఖండించాడు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశాడు. 'సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నాకు ఎప్పుడూ అత్యంత ఆత్మీయులు. ఆయనపై నాకు ఎప్పటికీ అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలన్నీ కేవలం అబద్ధాలు, వాస్తవం లేనివి. దయచేసి ఇటువంటి రూమర్లను నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు' అని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. దీంతో మహేష్ బాబుతో ప్రాజెక్ట్ గురించి వస్తున్న పుకార్లకు చెక్ పడినట్లయింది.
ఇక అనిల్ క్లారిటీ ఇచ్చాకా మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమా రిలీజ్ అవ్వకుండా.. అనిల్ తో సినిమా ఉంటుంది అంటే ఎలా నమ్మారురా అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వారణాసి షూటింగ్ పూర్తయ్యి.. రిలీజ్ అయ్యాక కానీ మహేష్ మరో సినిమా గురించి ఆలోచించడు అని కొందరు.. రాజమౌళి సినిమా తరువాత మహేష్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అనిల్ తో సినిమా భవిష్యత్ లో చేస్తాడేమో కానీ, వారణాసి వెంటనే అయితే ఉండదు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ పుకార్లకు వెంటనే చెక్ పెట్టి అనిల్ మంచి పని చేశాడని అంటున్నారు. మరి వారణాసి తరువాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడో తెలియాలంటే ఇంకో ఏడాది ఆగాల్సిందే.