Anil Ravipudi: సంక్రాంతి అంటే అనిల్ రావిపూడిదే.. ఈ ప్లానింగ్ చూసి నేర్చుకోవాల్సిందే!
ABN, Publish Date - Sep 12 , 2026 | 03:21 PM
టాలీవుడ్‌లో సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తువచ్చే పేరు అనిల్ రావిపూడి. ఎటువంటి వివాదాలకు పోకుండా, తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాక్సాఫీస్ వద్ద ప్రతిసారీ పండగ వాతావరణం తీసుకురావడం ఈ దర్శకుడి ప్రత్యేకత.
టాలీవుడ్‌లో సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తువచ్చే పేరు అనిల్ రావిపూడి. ఎటువంటి వివాదాలకు పోకుండా, తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాక్సాఫీస్ వద్ద ప్రతిసారీ పండగ వాతావరణం తీసుకురావడం ఈ దర్శకుడి ప్రత్యేకత. మొన్నటికి మొన్న జరిగిన 'ఇరుముడి' సక్సెస్ మీట్‌లో రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అనిల్ రావిపూడి ఎప్పుడు సెట్స్‌లోనే ఉంటాడో తెలియదు కానీ, ప్రతి ఏటా సంక్రాంతినే టార్గెట్‌గా చేసుకొని సినిమాలు ఎలా తీస్తాడో ఎవరికీ అర్థం కాదంటూ ఆయన చేసిన కామెంట్స్‌లో నిజానిజాలు ఎలా ఉన్నా, అనిల్ చూపించే అంకితభావం మాత్రం ప్రశంసనీయం. సినిమా రంగంలో ప్లానింగ్ ఎంత కచ్చితంగా ఉంటే ఫలితం అంత బాగా వస్తుంది. అనిల్ రావిపూడి ఈ విషయంలో మిగతా టెక్నీషియన్లకు ఆదర్శంగా నిలుస్తుంటారు. అనుకున్న తేదీకి సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం ఆయన నైజం. 2025 సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించారు. ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రంతో మెగాస్టార్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మరోసారి తన ఫేవరెట్ హీరో వెంకటేష్, తనకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన నందమూరి కళ్యాణ్‌రామ్‌తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 60 శాతానికి పైగా పూర్తయిందనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సైతం జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పార్ట్ సాంగ్స్‌ను ఇప్పటికే అందుకున్నారట.
సినిమా రషెస్ చూశాక ఈసారి సంక్రాంతి పండగ అనిల్ రావిపూడిదే అంటూ జీవీ ప్రకాష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. డిసెంబర్ నాటికి షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి, ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈసారి కూడా జనవరి 12న విడుదల సినిమాతో పాటు మెగాస్టార్ కాకా, శర్వానంద్ భోగి, శ్రీ విష్ణు కామెడీ ఎంటర్ టైనర్, మహాకాళీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలు అనుకున్న సమయానికి వస్తాయో లేదో అనే సందిగ్ధత ఉన్నప్పటికీ, అనిల్ రావిపూడి మాత్రం తాను అనుకున్న టార్గెట్‌ను సమయానికి రీచ్ కావడం ఖాయం. పక్కా ప్లానింగ్, అంకితభావం ఉంటే అనుకున్న విజయం తథ్యమని మరోసారి నిరూపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. సంక్రాంతి బరిలో ఈసారి కూడా ఆయన జోరు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి భారీ విజయం నమోదు కావడం తథ్యమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.