టాలీవుడ్‌ను ఊపేస్తున్న మలయాళ బ్యూటీ అనస్వర రాజన్..
ABN, Publish Date - Sep 08 , 2026 | 07:02 PM
మలయాళ ఇండస్ట్రీలో తన నటనతో ఆకట్టుకున్న యంగ్ భామ అనస్వర రాజన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది.
మలయాళ ఇండస్ట్రీలో తన నటనతో ఆకట్టుకున్న యంగ్ భామ అనస్వర రాజన్ (Anaswara Rajan) ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. క్యూట్ లుక్స్, సహజసిద్ధమైన అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే ఇక్కడ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేడు అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్లను విడుదల చేసి బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం కాకా (KAAKA). బాబీ కొల్లి దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ K నారాయణ నిర్మిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో అనస్వర రాజన్ చిరంజీవి కూతురుగా కనిపించనుంది. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో కాకా నుంచి అనస్వర పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆమె మెడికల్ స్టూడెంట్‌గా (చేతిలో బుక్స్, డాక్టర్ కోట్‌తో) చాలా పద్ధతిగా కనిపిస్తోంది. వెనుక చిరంజీవి షాడో బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఇక కాకా కాకుండా అనస్వర నటిస్తోన్న ఇంకో సినిమా ఇట్లు అర్జున. యంగ్ యాక్టర్ అనీష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తుండగా, దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అనస్వర కీర్తి అనే విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ఎర్రటి ఓణి ధరించి, చేతి సైగలు ప్రతిబింబించే రీతిలో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
ఈ రెండు సినిమాలు కాకుండా గోదావరి నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంతా రాములోరు చూసుకుంటారు చిత్రంలో కూడా అనస్వరనే హీరోయిన్. మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, VGB ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనస్వర శిరీష అనే పాత్రలో కనిపించనుంది. మారుతి.. శిరీష భుజంపై వాలి ఉన్న పోస్టర్ చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఈ పెద్ద ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో అనస్వర హవా గట్టిగా నడవనుందని అర్థమవుతోంది. మరి ఈ సినిమాలతో అమ్మడు ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.