సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Siva Kantamneni: చిరు మాటలే స్ఫూర్తిగా... 'అమరావతికి ఆహ్వానం'

ABN, Publish Date - Jan 31 , 2026 | 04:29 PM

శివ కంఠమనేని హీరోగా నటించిన 'అమరావతికి ఆహ్వానం' మూవీ టీజర్ ను మురళీమోహన్ ఆవిష్కరించారు. ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కాబోతోంది.

Amaravathiki Ahwanam

ఇటీవల చిరంజీవి (Chiranjeevi) ఒక కార్యక్రమంలో సినిమాను అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేస్తే అది సగం సక్సెస్ అన్నట్టుగా భావించొచ్చని అన్నారు. అదే పంథాలో తమ సినిమాను అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేశామని 'అమరావతికి ఆహ్వానం' (Amaravathi ki Ahwanam) మేకర్స్ చెప్పారు. శివ కంఠమనేని (Siva Kantamaneni), ధన్య బాలకృష్ణన్ (Dhnya Balakrishnan), ఎస్తేర్, సుప్రీత, హరీశ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్ ను ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళీమోహన్ (Murali Mohan) విడుదల చేశారు.


ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారధ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో కె.ఎస్. శంకరరావు, ఆర్. వెంకటేశ్వరరావు 'అమరావతికి ఆహ్వానం' మూవీని నిర్మించారు. ఈ సినిమాను జీవీకే తెరకెక్కించారు. టీజర్ ఆవిష్కరణ అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ, 'టీజర్ చాలా బాగుంది. మూవీ కంటెంట్ చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలుగుతోంది. ఈ నిర్మాతలు గతంలో కూడా చిన్న బడ్జెట్ లో మంచి చిత్రాలు చేశారు. మా గురువు దాసరి గారు చెప్పినట్లు చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం. కొత్త దర్శకుడైనా జీవీకే ప్రతిభావంతంగా సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్ర నిర్మాతలు వెంకటేశ్వరరావు, శంకర్ రావుతో నాకు చాలాకాలంగా స్నేహం ఉంది. వాళ్లు మా రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. తాము నిర్మిస్తున్న ఆరవ చిత్రం ఇదని, గతంలో భోజ్ పురిలోనూ ఓ సినిమా చేశామని, హారర్ జానర్ కు చెందిన 'అమరావతికి ఆహ్వానం' తప్పని సరిగా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని నిర్మాతల్లో ఒకరైన వెంకటేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ సినిమా నిర్మాతలకు విజయంతో పాటు డబ్బులను ఇవ్వాలని కోరుకుంటున్నట్టు ఎస్తేర్ చెప్పారు. వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా విడుదలలో కొంత జాప్యం జరిగిందని, ఫిబ్రవరి 13న మూవీని రిలీజ్ చేస్తున్నామని డైరెక్టర్ జీవీకే తెలిపారు. హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ, 'చిరంజీవి గారు బడ్జెట్ ను కంట్రోల్ లో పెట్టుకుని సినిమా తీస్తే సగం విజయం దక్కినట్టేనని అన్నారు. ఆ రకంగా మా సినిమాకు సగం సక్సెస్ దక్కినట్టే. ఇందులో ఎస్తేర్, ధన్య, సుప్రియ దెయ్యాల పాత్రల్లో భయపెడతారు. డైరెక్టర్ జీవీకె చక్కటి ప్లానింగ్ తో మూవీని తెరకెక్కించాడు' అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్నకుమార్, అశోక్ కుమార్, జెమినీ సురేశ్‌, శివ హరీష్‌, భద్రమ్, సినిమాటోగ్రాఫర్ జె. ప్రభాకర్ రెడ్డి, సంగీత దర్శకుడు పద్మనాభ భరద్వాజ్, నిర్మాతలు ఘంటా శ్రీనివాస్, రవిశంకర్ కంఠమనేని, కొమ్మాలపాటి సాయి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 04:30 PM