అల్లు సినిమాస్.... ఆసియాలో ఫస్ట్ డాల్బీ విజన్.
ABN, Publish Date - Mar 13 , 2026 | 04:15 PM
ఆసియాలోనే తొలి డాల్బీ విజన్ థియేటర్ గా 'అల్లు సినిమాస్' వెలసింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ థియేటర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆరంభమయ్యాయి...
ఆసియాలోనే తొలి డాల్బీ విజన్ థియేటర్ గా (Dolby Vision Theater) 'అల్లు సినిమాస్' (Allu Cinemas) వెలసింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ థియేటర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆరంభమయ్యాయి... అరవింద్ పై ఆయన తనయులు కురిపించిన అభిమానం సైతం అందరినీ ఆకర్షించింది...
నేనూ సినిమా పిచ్చోడినే... !
'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానూ ఒకప్పుడు సినిమా పిచ్చోడినేనని, తన అభిమాన హీరో కృష్ణ సినిమాలు చూడటానికి కర్నూల్, హైదరాబాద్ వచ్చి మూవీస్ చూసేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆసియాలోనే తొలి డాల్బీ విజన్ థియేటర్ ను హైదరాబాద్ కోకాపేట్ లో నిర్మించిన అల్లు అరవింద్ ను రేవంత్ రెడ్డి అభినందించారు. తెలుగు సినిమాల పోటీ పక్కనున్న కోలీవుడ్, బాలీవుడ్ తో కాకుండా ఏకంగా హాలీవుడ్ తో ఉండాలనీ రేవంత్ రెడ్డి అభిలషించారు. సినిమా అనేది సామాన్యులను సైతం ప్రభావితం చేసే శక్తిమంతమైన సాధనమని రేవంత్ రెడ్డి అన్నారు...
తండ్రిపై తనయుల ప్రేమ...
చిత్రసీమలో ఇంతింతై వటుడింతై అన్న చందాన అల్లు రామలింగయ్య తనదైన హాస్యాభినయంతో అలరించారు. ఆయన తనయుడు అల్లు అరవింద్ సైతం సినిమారంగాన్నే నమ్ముకొని సాగారు. ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా జేజేలు అందుకుంటున్న అరవింద్ తనయుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరోగా రాణిస్తున్నారు... శిరీష్ కూడా నటునిగానే ఉన్నారు... అరవింద్ పెద్ద కొడుకు వెంకటేశ్ కూడా తండ్రి బాటలోనే సినమారంగంలో సాగుతున్నారు... 'గీతా ఆర్ట్స్' పతాకంపై అనేక సూపర్ హిట్ మూవీస్ నిర్మించారు అరవింద్. ఎందరో చిన్న నిర్మాతలను ప్రోత్సహించారు అరవింద్. వారి చిత్రాలకు సమర్పకునిగా వ్యవహరించి వారందరినీ చిత్రసీమలో నిలదొక్కుకొనేలా చేశారు. అలాంటి వారిలో బన్నీ వాస్ ఉన్నారు. బన్నీ వాస్ తో పాటు మరో ముగ్గురు తమ పిల్లలకు 'అరవింద్' అని పేరు పెట్టుకోవడం చూస్తే ఆయన మంచితనం ఏ పాటిదో అర్థమవుతుందని శిరీష్ తన ప్రసంగంలో చెప్పారు.. అరవింద్ తనకు తండ్రి మాత్రమే కాదని, దేవుడని అల్లు అర్జున్ తెలిపారు. తండ్రి తమకు అందించిన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళతామని బన్నీ అన్నారు...
'వాల్ ఆఫ్ ఫేమ్'తో రచ్చ...
అల్లు అర్జున్ తమ 'అల్లు సినిమాస్' మల్టీప్లెక్స్ లో ఓ వాల్ ను పూర్తిగా గ్రేట్ డైరెక్టర్స్ కు అంకితం చేశారు. ఆ 'వాల్ ఆఫ్ ఫేమ్'పై భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన ప్రముఖ దర్శకుల పిక్స్ ను ఏర్పాటు చేశారు. సినిమా పట్ల అల్లు అర్జున్ కు ఉన్న గౌరవాన్ని ఈ 'వాల్ ఆఫ్ ఫేమ్' రుజువు చేస్తోందని చెప్పొచ్చు. మల్టీప్లెక్స్ లో ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి చిత్రాన్ని ఏర్పాటు చేశారు బన్నీ. చిరంజీవితో పాటు వాల్ ఆఫ్ ఫేమ్ పై ఉన్న డైరెక్టర్స్, తన తండ్రి అరవింద్, తాత అల్లు రామలింగయ్య పిక్స్ ను ప్రదర్శించారు. ఈ 'వాల్ ఆఫ్ ఫేమ్' ప్రదర్శనలో ప్రముఖ దర్శకులు శంకర్, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను వంటి దర్శకుల ఫోటోలు కనిపించలేదని సోషల్ మీడియాలో ఓ చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే ఐ మ్యాక్స్ లోని బిగ్ స్క్రీన్, సూళ్లూరు పేటలోని యువీ వంశీ నిర్మించిన థియేటర్లు చూసే అల్లు సినిమాస్ కట్టాలని నిర్ణయించుకున్నట్లు అరవింద్ చెప్పారు... ఏది ఏమైనా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన 'అల్లు సినిమాస్' సినీ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తోంది... ఈ థియేటర్స్ మార్చి 19న ఉగాది నుండి ప్రదర్శన ఆరంభిస్తాయి... వీటిలో ముందుగా పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', రణ్ వీర్ సింగ్ 'ధురంధర్-2' చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి...