సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు అర్జున్ రాక‌.. సీఎం స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాట్లు

ABN, Publish Date - Aug 10 , 2026 | 07:32 AM

అల్లు అర్జున్ విశాఖ పర్యటన సందర్భంగా అసాధ‌ర‌ణ రీతిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) విశాఖపట్నం(Visakhapatnam) పర్యటన సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన భారీ భద్రత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇనార్బిట్ మాల్‌లోని ఏఏఏ సినిమాస్ (AAA Cinemas) ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు అల్లు అర్జున్ ఆదివారం ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి విశాఖకు చేరుకున్నారు. పోర్టు ఆస్పత్రి సమీపంలో కొత్తగా నిర్మించిన ఇనార్బిట్ మాల్‌లో ఏఏఏ సినిమాస్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తుగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పలు రహదారులను బారికేడ్లతో మూసివేశారు. కైలాసపురం నుంచి నరసింహనగర్ వైపు వెళ్లే మార్గంతో పాటు పోర్టు క్వార్టర్స్ నుంచి జాతీయ రహదారికి చేరుకునే రోడ్డులోనూ ఆంక్షలు విధించారు. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అల్లు అర్జున్ పర్యటన కోసం చేసిన భద్రతా ఏర్పాట్లు సీఎం స్థాయి బందోబస్తును తలపించాయని పోలీసు వర్గాల్లో చర్చ జరిగినట్లు సమాచారం. నగర పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో డీసీపీ నేతృత్వంలో ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు సహా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని విధుల్లోకి దించారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇనార్బిట్ మాల్ వరకు అల్లు అర్జున్ ప్రయాణించే మార్గంలో కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఆయన బస చేసే నోవాటెల్ హోటల్‌కు వెళ్లే దారిలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ విడుదల సమయంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.అయితే, ఓ సినిమా న‌టుడి కార్యక్రమం కోసం ఇంత భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, నగర వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

Updated Date - Aug 10 , 2026 | 10:10 AM