రాకా.. సడెన్ గా ఇన్ని లీక్స్ ఏంటి చెప్మా
ABN, Publish Date - Sep 04 , 2026 | 09:59 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా చిత్రం రాకా (RAAKA). ఈ చిత్రం మొదలైన దగ్గరనుంచి ఇప్పటివరకు ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా చిత్రం రాకా (RAAKA). ఈ చిత్రం మొదలైన దగ్గరనుంచి ఇప్పటివరకు ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే పుకార్లు వేరు.. లీకులు వేరు. సాధారణంగా పెద్ద సినిమా షూటింగ్ జరుగుతోంది అంటే.. లీకులు అనేవి వస్తూనే ఉంటాయి. వారణాసి, స్పిరిట్ లాంటి సినిమాలకే లీకుల బెడద తప్పలేదు. నిజం చెప్పాలంటే ఈ లీకుల వలన సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతుంటాయి. ఇక రాకా విషయంలో మొన్నటివరకు ఎలాంటి లీకులు లేవు. కాకపోతే పుకార్లు వచ్చాయి. ఆ హీరోయిన్ నటిస్తోంది.. ఈ హీరోయిన్ బన్నీతో రొమాన్స్ చేస్తుంది అలాంటివే వచ్చాయి. దీంతో సినిమా ప్రకటించి ఏడాదైనా, కేవలం ఫస్ట్ లుక్ తప్ప టీజర్ గానీ, షూటింగ్ అప్‌డేట్స్ గానీ రాకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు.
ఇకపోతే సడెన్ గా కొన్నిరోజులుగా రాకా గురించే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమా నుంచి ఒక్కో లీక్ బయటపడుతుంది. ఒకసారి రిలీజ్ డేట్, ఇంకోసారి బన్నీ క్యారెక్టర్, మరోసారి హీరోయిన్ క్యారెక్టర్.. ఇలా ఒక్కోక్కటి లీక్ అవుతూ వస్తుంది. ప్రధానంగా ఈ సినిమా విడుదల తేదీపై తీవ్రమైన చర్చ సాగుతోంది. మేకర్స్ 2027 మధ్యలో విడుదల చేస్తారని భావించినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్, భారీ మేకింగ్ కారణంగా 2027 డిసెంబర్‌లోనే థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ ఈ చిత్రంలో మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడని, ఎవరికి వారు తెలియని ముగ్గురు బన్నీలు ఇందులో కనిపించనున్నారని టాక్ నడిచింది.
ఇది కాకుండా ఇందులో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే గర్భవతిగా ఉన్న సమయంలోనే అట్లీ ఆమెపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని, సినిమాలో కూడా ఆమె క్యారెక్టర్ ప్రెగ్నెంట్‌గానే కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.ఇవే పెద్ద లీక్స్ అనుకుంటే.. వీటితో పాటు రష్మిక మందన్నా పాత్ర సినిమాలో ఎప్పుడు వస్తుంది అనేది కూడా లీక్ అయ్యినట్లు సమాచారం. రష్మిక క్యారెక్టర్ సినిమాకు పెద్ద హైలైట్ అని, ఆమె పాత్ర ద్వితీయార్థంలో ఎంట్రీ ఇస్తుందని టాక్. దీంతో సడెన్ గా ఈ లీకుల గోల ఏంటి. ఈ లీకులు నిజంగానే బయటకు వచ్చాయా లేక మేకర్స్ హైప్ పెంచడానికి ప్రమోషన్ స్ట్రాటజీని వాడుతున్నారా అనేది మిస్టరీగా మారింది. ఈ లీకులన్నీ నిజమా.. కాదా.. అనేది తెలియాలంటే రాకా వచ్చేవరకు ఆగాల్సిందే.