టాలీవుడ్ ట్రెండ్ మారుస్తున్న బన్నీ.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా
ABN, Publish Date - Jul 27 , 2026 | 05:44 PM
తెలుగు సినిమా అంటే ఎలా ఉంటుంది. ఒక హీరో.. వందమంది విలన్స్ వచ్చినా ఒక్క దెబ్బ తగలకుండా వారందరినీ మట్టి కరిపించాలి. హీరోయిన్ ని ఏడిపించాలి.. ప్రేమించాలి.. రొమాన్స్.. డ్యూయెట్స్. ఒకప్పుడు ఇలా ఉంటేనే తెలుగు సినిమా. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.
తెలుగు సినిమా అంటే ఎలా ఉంటుంది. ఒక హీరో.. వందమంది విలన్స్ వచ్చినా ఒక్క దెబ్బ తగలకుండా వారందరినీ మట్టి కరిపించాలి. హీరోయిన్ ని ఏడిపించాలి.. ప్రేమించాలి.. రొమాన్స్.. డ్యూయెట్స్. ఒకప్పుడు ఇలా ఉంటేనే తెలుగు సినిమా. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. జనరేషన్ మారేకొద్దీ కొత్త కథలు వస్తున్నాయి. దానికి తగ్గట్లు హీరోలు కూడా మారుతూ వస్తున్నారు. కొత్త ప్రయోగాలకు సై అంటున్నారు. కథ డిమాండ్ చేస్తే డిజేబిలిటీ ఉన్నట్లు కూడా నటించడానికి సిగ్గుపడడం లేదు. అయితే తాజాగా ఒక స్టార్ హీరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. రొమాన్స్, డ్యూయెట్.. కాదు అసలు హీరోయిన్ కూడా లేకుండా సినిమా చేసి టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయడానికి రంగం సిద్ధం చేశాడు. ఎవరా హీరో అంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).
అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత బన్నీ, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక బిగ్గెస్ట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్న ఈ క్రేజీ కాంబో గురించి ప్రస్తుతం ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో అసలు హీరోయిన్ పాత్రే ఉండదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. లోకేష్ ఇలాంటి సినిమాలు తీయడంలో దిట్ట అని అందరికీ తెల్సిందే. ఖైదీ, విక్రమ్ సినిమాలు అలా తెరకెక్కినవే. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఇదే తరహా ఫార్ములాతో బన్నీ సినిమాను తెరకెక్కించనున్నాడని సమాచారం.
కమర్షియల్ సినిమాల్లో రెగ్యులర్‌గా ఉండే రొమాన్స్, లవ్ ట్రాక్‌లు, డ్యూయెట్ పాటలు ఈ సినిమాలో ఉండవట. ఎటువంటి కమర్షియల్ హంగులకు చోటు ఇవ్వకుండా, కేవలం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తోనే ఈ సినిమాను లోకేష్ ప్లాన్ చేస్తున్నారట. ఒక తిరుగులేని మాస్ స్టార్ హీరో సినిమా.. అందునా పూర్తిస్థాయి కమర్షియల్ డైరెక్టర్ తెరకెక్కించే చిత్రంలో కథానాయిక లేకపోవడం నిజంగా టాలీవుడ్‌లో ఒక కొత్త పరిణామమనే చెప్పాలి. అయితే అంతా బానే ఉంది కానీ, బన్నీ పక్కన హీరోయిన్ లేకపోతే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. బన్నీ డ్యాన్స్ కోసమే చాలామంది సినిమాకు వస్తారు. ఇప్పుడు అసలు అలాంటివేమీ లేవు అంటే ఫ్యాన్స్ తట్టుకోగలరా.. అంటే లోకేష్ అంతకుముందు సినిమాల కథలను దృష్టిలో పెట్టుకొంటే తప్పకుండా ఒప్పుకుంటారని పలువురు చెప్పుకొస్తున్నారు. హీరోయిన్ లేకుండా సినిమా చేసి బన్నీ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తాడా అనేది చూడాలి.