Raaka: మూడు పాత్రలు.. నలుగురు హీరోయిన్లు! అట్లీ ఫ్లాన్ అదిరింది
ABN, Publish Date - Aug 30 , 2026 | 12:23 PM
మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ ‘రాకా’ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కమర్షియల్ మాంత్రికుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka) ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ మొదలై ఏడాదిన్నర కావస్తున్నా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ రిలీజ్ చేసే అప్‌డేట్స్ మినహా ఎలాంటి లీక్స్ కు తావు ఇవ్వకుండా చాలా పకడ్భందీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ చిత్ర షూటింగ్ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, 800 నుంచి 1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నారనే వార్త సినీ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తండ్రీ కొడుకుల అనుబంధం, వైవిధ్యమైన పాత్రలతో సాగే ఈ కథలో, ఒక కొడుకు పాత్ర అత్యంత క్రూరమైన నెగెటివ్ షేడ్స్‌తో ఉండబోతుందని తెలుస్తోంది. ఒకే చిత్రంలో మూడు భిన్నమైన కోణాల్లో అల్లు అర్జున్ నటిస్తుండటం ఆయన కెరీర్‌లోనే తొలిసారి కావడం విశేషం. అయితే, ఒక స్టార్ హీరో ఇంతటి ప్రయోగాత్మక త్రిపాత్రాభినయం చేస్తే ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
అట్లీ గత చిత్రాల శైలికి పూర్తి భిన్నంగా, పూర్తిగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ కథ సాగనుండటం మరో విశేషం. ఈ భారీ చిత్రంలో తారల ఎంపిక కూడా అంతే స్థాయిలో ఉంది. దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పైగా ఈ సినిమాలో రష్మిక మందన్నా నెగిటివ్ రోల్ లో కనిపించబోతుందనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. కేవలం ఒక్కరితో సరిపెట్టకుండా నలుగురు స్టార్ హీరోయిన్లను రంగంలోకి దించడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ ఎంత భారీ దృష్టి పెట్టారో అర్థం చేసుకోవచ్చు.
భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఒక్క సినిమాతో ముగించకుండా, రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. మొదటి భాగం ప్రేక్షకులను ఒక కొత్త లోకానికి తీసుకెళ్తే, రెండో భాగం మరింత ఉత్కంఠభరితంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండింటి షూటింగ్ కూడా ఒకేసారి నడుస్తుందని టాక్ వినిపిస్తుంది.
రిలీజ్ విషయంలో కూడా పెద్దగా గ్యాప్ లేకుండా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ ఏడాది చివరకు బన్నీకి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత బన్నీ లోకేష్ కనగరాజు ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతారు. ఇక రాకా సినిమాకు సంబంధించి అధికారిక టీజర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ మేకోవర్, అట్లీ టేకింగ్ కలగలిపి బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తాయో వేచి చూడాలి.