మళ్ళీ ట్రోల్స్‌కు గురయిన అల్లు అర్జున్
ABN, Publish Date - Mar 14 , 2026 | 03:29 PM
అల్లు అర్జున్ మరోసారి ట్రోలింగ్ కు గురవుతున్నారు. అల్లు సినిమాస్ కార్యక్రమంలో అల్లు అర్జున్ దంపతులకు ఆమడ దూరంలో మిగిలిన వారు నడవడం చూసి 'బన్నీ రూల్స్' నిజమే నని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
బన్నీ బాబు 'తగ్గేదే లే' అంటూ సాగుతున్నారు. ఆయనను కలుసుకొనేందుకు పలు నిబంధనలు ఉన్నాయని అప్పట్లో రచ్చ సాగింది. లేటెస్ట్ వీడియో చూస్తోంటే బన్నీ రూల్స్ నిజమే అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకూ ఏమిటి సంగతి !?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను కలుసుకోవాలంటే '42 రూల్స్' ఉంటాయని అప్పట్లో ఓ పాడ్ కాస్ట్‌లో కావేరీ బారువా అనే బ్రాండ్ స్ట్రాటజిస్ట్ చెప్పారు. ఆమె కామెంట్స్‌పై పెద్ద దుమారం రేగింది. కొందరు నిజమా అంటూ ఆశ్చర్య పోయారు. మరికొందరు నిజమే అయి ఉంటుందిలే అన్నారు. ఇంకొందరు బారువా మాటల్లో వాస్తవం లేదని, బన్నీ అలాంటి వారు కాదని చెప్పారు. ముఖ్యంగా బన్నీ పీఆర్ టీమ్ బారువా కామెంట్స్‌ను ఖండించారు. అందుకు తరువాత బారువా క్షమాపణలు కూడా చెప్పారు. అంతటితో ఇష్యూ అయిపోయిందని భావించారు. అయితే ఇటీవల అల్లు అరవింద్ హైదరాబాద్ కోకాపేటలో 'అల్లు సినిమాస్' (Allu Cinemas) అనే అధునాతన మల్టీప్లెక్స్ నిర్మించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి (Sneha Reddy) తో కలసి థియేటర్స్ లోకి వెళ్తున్నారు. అప్పుడు అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూడగానే వెనకాల వస్తున్నవారు ఆగిపోయి పక్కకు తప్పుకోవడం కెమెరా కళ్ళకు చిక్కింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో మళ్ళీ అల్లు అర్జున్ పై ట్రోల్స్ సాగుతున్నాయి.
హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్... ఏ వుడ్‌లోనైనా స్టార్స్ కాసింత నోరు జారినా, కాస్త వెకిలిగా ప్రవర్తించినా ట్రోల్స్‌కు గురి కాకుండా ఉండలేరు. కొందరు టాలీవుడ్ సీనియర్ స్టార్స్ కూడా వారి మాటలతోనో, చేతలతోనో ట్రోల్స్‌కు గురయ్యారు. అల్లు అర్జున్‌ను కలవాలంటే '42 రూల్స్ ఉంటాయి' అన్న మాటను ఆయన ఉన్న ఓ వీడియో రుజువు చేస్తోందని పలువురు అంటున్నారు. ఆ వీడియోలో బన్నీ వెనుతిరిగి చూడగానే వెనకాల వస్తున్నవారు ఆగిపోవడం, కొందరు పక్కకు తప్పుకోవడం చూసిన వారు ఇది '31వ రూల్' అని చాటింపేస్తున్నారు. ఎవరైనా వెనకాల రావలసిందే కానీ, బన్నీని దాటి పోకూడదు అన్నదే ఆ నిబంధన అట. అందువల్లే ఈ వీడియోను 31వ రూల్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
'అల్లు అర్జున్'ను కలవాలంటే నిజంగా 42 రూల్స్ పాటించాల్సిందేనా అని కొందరికి డౌట్ కలుగుతోంది. అయితే బన్నీ పీఆర్ టీమ్ 'అందులో వాస్తవం లేదని' అంటున్నారు. అల్లు అర్జున్ అందరినీ ఫ్రీగా కలుస్తారని, ఎంతో దూరం నుండి వచ్చే ఫ్యాన్స్ ను ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు తెలుసుకుంటూ ఉంటారని బన్నీ ప్రచార బృందం చెబుతోంది. అసలు అల్లు అర్జున్‌ను కలవడానికి ఎలాంటి రూల్స్ లేవనీ నొక్కి వక్కాణిస్తున్నారు. తమ హీరో అందరితో ఎలా ఉంటారో తెలిపే వీడియోస్ ను బన్నీ పీఆర్ టీమ్ రిలీజ్ చేస్తే కానీ, ట్రోలర్స్ నమ్మేలా లేరు.
ఇదే సమయంలో అల్లు అర్జున్, రశ్మిక మందన్న (Rashmika Mandanna) తో కలిసి ముంబైకి 'పుష్ప-2' సినిమా ప్రమోషన్స్‌కు వెళ్ళినప్పుడు వారిద్దరూ కట్టుదిట్టమైన భద్రత నడుమ కూడా ఇబ్బందులు పడిన వీడియోను కొందరు పోస్ట్ చేశారు. సినిమా వాళ్ళ మీద ఇలా జనాలు పడిపోతుంటే... అల్లు అర్జున్ తనకు కాస్తంత దూరంగా జనాలు ఉండాలని కోరటంలో తప్పేమి ఉందని కొందరు వాదిస్తున్నారు.