Allu Arjun: నా జీవితాన్ని మార్చేసింది నువ్వే..
ABN, Publish Date - Jan 11 , 2026 | 12:28 PM
అల్లు అర్జున్ (Allu Arjun).. గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా.. అది హిట్ అయినా కూడా బన్నీని వెనక్కి తిరిగి చూడకుండా చేసిన సినిమా మాత్రం ఆర్య అనే చెప్పాలి.
Allu Arjun: అల్లు అర్జున్ (Allu Arjun).. గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా.. అది హిట్ అయినా కూడా బన్నీని వెనక్కి తిరిగి చూడకుండా చేసిన సినిమా మాత్రం ఆర్య అనే చెప్పాలి. ఇక స్టార్ హీరోగా కొనసాగుతున్నా పాన్ ఇండియా లెవెల్ హీరోగా నిలబెట్టిన సినిమా మాత్రం పుష్ప అనే చెప్పాలి. ఇలా అల్లు అర్జున్ ని ఒక స్థాయిలో నిలబెట్టిన డైరెక్టర్ ఎవరు అంటే కచ్చితంగా సుకుమార్ (Sukumar) పేరు మాత్రమే వినిపిస్తుంది. అందుకే సుకుమార్ అంటే అల్లు అర్జున్ కు అమితమైన ఇష్టం.
నేడు సుకుమార్ 56 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఉదయం నుంచి అభిమానులతో పాటు స్టార్స్ కూడా సుకుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ సైతం.. సుక్కుకు బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చాడు. పుష్ప సమయంలో సుకుమార్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. తన జీవితాన్ని మార్చిన వ్యక్తి సుకుమార్ అని చెప్పుకొచ్చాడు బన్నీ. ' పుట్టినరోజు శుభాకాంక్షలు, సుకుమార్ డార్లింగ్. ఈ రోజు నీకంటే నాకే చాలా ప్రత్యేకమైనది... ఎందుకంటే ఈ రోజు నా జీవితాన్ని మార్చేసింది. నా జీవితంలో నువ్వు ఉన్నందుకు నేను పొందే ఆనందాన్ని ఎన్ని పుట్టినరోజులకు శుభాకాంక్షలు చెప్పినా వ్యక్తపరచలేను' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక చివర్లో పుట్టినందుకు థాంక్స్ అని నవదీప్ స్టైల్లో చెప్పుకొచ్చాడు. నవదీప్ ప్రతి ఏడాది.. బన్నీ బర్త్ డే కి పుట్టినందుకు థాంక్స్ బావ అని చెప్తాడు. అదే డైలాగ్ ని బన్నీ సుకుమార్ కి వాడడంతో ఆ కాపీ రైట్స్ కూడా నవదీప్ కే ఇచ్చేసాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. బన్నీ - సుకుమార్ కలయికలో ఇప్పటికీ నాలుగు సినిమాలు వచ్చాయి. ఆర్య, ఆర్య 2, పుష్ప, పుష్ప 2. ఇక త్వరలోనే పుష్ప 3 కూడా మొదలు కానుందని తెలుస్తోంది. వీరిద్దరి బంధం ఇలానే కలకాలం కొనసాగాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.