Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన.. వర్చువల్‌గా కోర్టుకు హాజరైన పుష్ప..
ABN, Publish Date - Jul 06 , 2026 | 02:19 PM
పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ జరిగిన ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు.
పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ జరిగిన ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రాకా’ (Raaka) షూటింగ్ కారణంగా ముంబయిలో ఉండడంతో వర్చువల్‌గా విచారణకు హాజరుకావడానికి న్యాయస్థానం అనుమతిన ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్‌లో న్యాయమూర్తి ఎదుట బన్నీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కొంతమంది నిందితులు వ్యక్తిగత కారణాలతో న్యాయస్థానానికి హాజరుకాకపోవడంతో తదుపరి విచారణను జులై 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో 23 మంది నిందితులపై 500 పేజీల ఛార్జీ షీట్‌ను కాపీలను పీపీ కోర్టుకు సమర్పించారు.
డిసెంబర్ 5, 2024న పుష్ప-2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. డిసెంబర్ 4వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్ షో చూడ్డానికి రేవతి అనే మహిళ తన కుమారుడు శ్రీతేజ్‌తో కలిసి సంధ్య థియేటర్‌కు వచ్చింది. ఈ నేపథ్యంలోనే థియేటర్ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చర్లపల్లికి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మొదట నాలుగు వారాల మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.