అల్లు అరవింద్ వర్సెస్ యశ్ మదర్ కాంట్రవర్సీ.. వర్మ పోస్ట్ వైరల్
ABN, Publish Date - Sep 04 , 2026 | 12:51 PM
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, కన్నడ స్టార్ హీరో యశ్ మదర్ మధ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కాంట్రవర్సీ వైరల్ అవుతోన్న విషయం తెలియంది కాదు. ఈ వివాదంపై రామ్ గోపాల్ వర్మ విశ్లేషణ పోస్ట్ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, కన్నడ స్టార్ హీరో యశ్ మదర్ మధ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కాంట్రవర్సీ వైరల్ అవుతోన్న విషయం తెలియంది కాదు. ఈ వివాదానికి కారణమైన వీడియో 2023లోది కావడం విశేషం. ‘కోటబొమ్మాళి PS’ సినిమాకు సంబంధించిన వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. KGFకు ముందు, KGF తర్వాత యశ్ ఎదిగిన స్థాయి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. ఒక సినిమా, ఒక శుక్రవారం కూడా ఓ నటుడి కెరీర్‌ను పూర్తిగా మార్చగలదనే విషయాన్ని చెప్పే సందర్భంలోనే ఆయన యశ్ ప్రస్తావనను తీసుకొచ్చారు. దీనిపై యశ్ మదర్ రీసెంట్‌గా తీవ్ర స్థాయిలో స్పందించారు.
అసలు అల్లు అరవింద్ వ్యాఖ్యల్లో యశ్‌ను విమర్శించే ఉద్దేశం ఎక్కడా కనిపించలేదని, ఆయన ఎదుగుదలను ఉదాహరణగా చెబుతూ ప్రశంసించే విధంగానే మాట్లాడారని ఇప్పటికే పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన విశ్లేషణ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘‘యశ్ పై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివాదం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే, పెద్దగా పరిచయం లేని నటులతో భారీ సినిమాలు తీయడం గురించి మాట్లాడుతూ.. ‘కెజియఫ్’కు ముందు యశ్ ఎవరో తనకు తెలియదని ఆయన అన్నప్పుడు దాని అసలు అర్థం ఏంటో ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. ‘బాహుబలి’కి ముందు హిందీ ప్రేక్షకులకు ప్రభాస్ ఎవరో తెలియదు, ‘కాంతార’కు ముందు రిషబ్ శెట్టి ఎవరో తెలియదు, ‘గాడ్‌ఫాదర్’కు ముందు మార్లన్ బ్రాండో ఎవరో నాకు తెలియదు.. బహుశా ఆయన అంతకుముందు ‘ఎ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్’, ‘ఆన్ ది వాటర్‌ఫ్రంట్’ వంటి చిత్రాలతో స్టార్ అయి ఉండవచ్చు.. ఆ సినిమాలు ఇండియాలో విడుదలయ్యాయో లేదో కూడా నాకు తెలియదు. ఆ సినిమాలే వారిని అంత పెద్ద స్టార్లను చేశాయి తప్ప, వారి వల్ల ఆ సినిమాలు హిట్ అవ్వలేదు.
హాలీవుడ్ ఎప్పుడూ కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలపైనే భారీగా ఖర్చు పెడుతుంది తప్ప స్టార్లపై కాదు. క్రిస్టోఫర్ నోలన్ లాంటి దర్శకులు కూడా నటీనటుల స్టార్‌డమ్‌పై ఆధారపడటానికి కాకుండా, కేవలం వారి నటనా సామర్థ్యం కోసమే పెద్ద పేర్లను ఎంచుకుంటారు. అది ‘ఓపెన్‌హైమర్’ అయినా లేదా ‘ఒడిస్సీ’ అయినా, అందులో ఎవరు నటించినా ఆ సినిమాలు అంతే స్థాయిలో విజయం సాధిస్తాయని మనందరికీ తెలుసు. ఇక అల్లు అరవింద్ విషయానికొస్తే.. అంతటి సాధారణమైన, ఒక మంచి ఆలోచనతో అన్న మాటలను కేవలం అహంభావం (ఈగో) ఉన్నవారు మాత్రమే తమకు వ్యక్తిగతంగా ఆపాదించుకుని ఫీల్ అవుతారు. నిజానికి, వారిలాంటి వారు అలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారో ఇలాంటి ప్రతిస్పందనలే స్పష్టంగా తెలియజేస్తున్నాయి.’’ అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అసలు 2023లో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తీసుకొచ్చి ఇప్పుడు వైరల్ చేయడం ఏంటి?. వీడియో పూర్తిగా చూసిన తర్వాతే దాని సందర్భం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. అల్లు అరవింద్ చెప్పిన విషయాన్నే మరో సందర్భంలో యశ్ కూడా చెప్పినట్లు పలువురు గుర్తు చేస్తున్నారు. ఒక సినిమా విజయంతో నటుడి కెరీర్, మార్కెట్, స్టార్‌డమ్ ఒక్కసారిగా మారిపోవచ్చనే విషయమే ఇద్దరి వ్యాఖ్యల్లోనూ ప్రధానంగా కనిపిస్తుందనేది అల్లు అరవింద్ వ్యాఖ్యలలో సారాంశంమని అంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని సెకన్ల క్లిప్పులను మాత్రమే చూసి ఒక నిర్ణయానికి రావడం కంటే.. పూర్తి వీడియోను చూసి అసలు సందర్భాన్ని అర్థం చేసుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యశ్ మదర్ ఈ వీడియోను పూర్తి సందర్భంతో చూసి ఉంటే, అసలు అల్లు అరవింద్ వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటో, ఆమెకు అర్థమై ఉండేదని అంటున్నారు. చూద్దాం మరి.. వర్మ వివరణ తర్వాతైన ఈ కాంట్రవర్సీకి ఫుల్‌స్టాప్ పడుతుందేమో..
ఇవి కూడా చదవండి:
నేపాల్‌కు ‘చేయూతనివ్వండి’.. రంగంలోకి రియల్ హీరో
ట్విన్స్‌తో జన్మాష్టమి.. ఉపాసన షేర్ చేసిన పిక్ వైరల్
సినిమా రివ్యూ: ధర్మస్థల నియోజకవర్గం