All Time Top Grossers: ఇండియన్ టాప్ గ్రాసర్స్‌లో 'రామాయణ' సంచలనం.. వరల్డ్ వైడ్ నంబర్ వన్ మూవీ ఏదో తెలుసా?
ABN, Publish Date - Nov 23 , 2026 | 12:08 PM
రామాయణ కలెక్షన్ల వివరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల జాబితా తెలుసుకోండి.
'రామాయణ' రికార్డ్ !
ఓ యేడాదిలో అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రాన్ని ఆ సంవత్సరం 'టాప్ గ్రాసర్' అంటారు. అంతకు ముందు ఏ సినిమా సాధించనంత కలెక్షన్స్ రాబట్టిన సినిమాను 'ఆల్ టైమ్ హిట్'గా కీర్తిస్తారు. ఈ తేడా తెలిసినా ఎవరికి వారు తమ చిత్రాలను 'బ్లాక్ బస్టర్స్'గానూ, 'ఆల్ టైమ్ హిట్స్'గానూ పేర్కొనడం చూసేవారికి వింతగా అనిపిస్తోంది. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని, టోటల్ రన్ లో ఏ సినిమా ఎంత వసూలు చేసిందో ఇట్టే తెలిసిపోతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
మన ఇండియాలో టాప్ టెన్ హయ్యెస్ట్ గ్రాసర్స్ (All Time Top Grossers) జాబితాలో రెండువేల కోట్ల గ్రాస్ తో 'దంగల్' నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. దాని తరువాతి స్థానంలో మొన్నటి దాకా మన బాహుబలి-2 (Baahubali) ఉండేది. ఇప్పుడు 1850 కోట్ల గ్రాస్ తో ధురంధర్-2 (Dhurandhar 2) రెండో స్థానం ఆక్రమించగా, 1800 కోట్ల 'బాహుబలి-2' మూడోస్థానంలో చేరింది. నాలుగో స్థానంలో పుష్ప-2 (Pushpa 2) 1750 కోట్ల గ్రాస్ పోగేసింది. కేవలం రెండు వారాల్లోనే 1500 కోట్లకు పైగా రాబట్టి 'రామాయణ' ఐదో స్థానంలో నిలచింది. దాంతో 'రామాయణ (Ramayana) మూవీపై ఇప్పుడు చర్చ సాగుతోంది.
'ధురంధర్' సీక్వెల్ ఘనత..
వెయ్యి కోట్ల గ్రాస్ తో షారుఖ్ ఖాన్ 'పఠాన్' పదో స్థానంలో నిలచింది. దానిపై స్థానంలోనూ షారుఖ్ 'జవాన్' 1100 కోట్ల గ్రాస్ తో ఉంది. 'కేజీఎఫ్-2' చిత్రం 1200 కోట్లతో ఎనిమిదో స్థానంలోనూ, 1300 కోట్లతో ట్రిపుల్ ఆర్ (RRR) ఏడో స్థానంలోనూ నిలిచాయి. 'ధురంధర్-1' 1400 కోట్లతో ఆరో స్థానం సంపాదించింది. 'ధురంధర్' రెండు భాగాలు టాప్ టెన్ గ్రాసర్స్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో రెండు వేర్వేరు సినిమాలతో షారుఖ్ ఖాన్ నిలవగా, 'ధురంధర్' రెండు భాగాలతో రణవీర్ సింగ్ కూడా ఉన్నారు. ఆమిర్ ఖాన్, ప్రభాస్, అల్లుఅర్జున్, రణబీర్ కపూర్, యశ్ ఒక్కో చిత్రంతో ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, 'ట్రిపుల్ ఆర్' ఒకే చిత్రంతో యన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఈ లిస్టులో స్థానం సంపాదించారు. 'రామాయణ' టోటల్ రన్ లో ఇంకా పైకి దూసుకుపోతే ఈ స్థానాలు మారే ఛాన్స్ ఉంది.
'టైటానిక్' చరిత్ర..!
మన భారతీయ సినిమాల వసూళ్ళను మనవాళ్ళే అనుమానంగా చూస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా సినిమాలను చూసిన ప్రేక్షకుల సంఖ్యను పక్కాగా లెక్కించి మరీ వసూళ్ళు చెబుతున్న హాలీవుడ్ మూవీస్ పై మాత్రం ఇండియన్ సినీ ఫ్యాన్స్ డౌట్ పడటం లేదు. ఆల్ వరల్డ్ లో టాప్ టెన్ గ్రాసర్స్ విషయానికి వస్తే 'జూటోపియా-2' సినిమా 17, 569 కోట్లతో పదో స్థానంలో నిలచింది. దాని ముందు ప్లేస్ లో 18,000 కోట్లతో 'స్పైడర్ మేన్- నో వే హోమ్' కనిపిస్తోంది. 18, 828 కోట్లు సాధించిన 'నె ఝా -2' ఎనిమిదో స్థానంలో నిలచింది. ఏడో స్థానంలో ఉన్న 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' 19, 240 కోట్లు కొల్లగొట్టింది. 'స్టార్ వార్స్-ద ఫోర్స్ అవేకెన్స్' మూవీ 19, 314 కోట్లతో ఆరో స్థానం సంపాదించింది. దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం జేమ్స్ కేమరాన్ (James Cameron) తెరకెక్కించిన 'టైటానిక్' 20, 883 కోట్ల వసూళ్ళతో ఐదో స్థానంలో నిలచింది. ఇన్నేళ్ళుగా టాప్ టెన్‌లో నిలచిన సినిమాగా 'టైటానిక్' ఓ చరిత్ర సృష్టించింది.
జేమ్స్ కేమరాన్.. ఒక్కడే!
'టైటానిక్' డైరెక్టర్ జేమ్స్ కేమరాన్ రూపొందించిన 'అవతార్-ద వే ఆఫ్ వాటర్' మూవీ 21,821 కోట్లతో నాలుగో స్థానంలో నిలచింది. 23,684 కోట్లతో 'స్పైడర్ మేన్- బ్రాండ్ న్యూ డే' మూడో స్థానం సంపాదించింది. 2009లో రూపొందిన 'అవతార్-1' మూవీ 27, 465 కోట్లతో రెండో స్థానం దక్కించుకుంది. ఈ మూవీ కంటే 177 కోట్ల ఆధిక్యంతో అంటే 27, 642 కోట్లు పోగేసి 'అవెంజర్స్: ఎండ్ గేమ్' నంబర్ వన్ ప్లేస్ లో నిలచింది. వరల్డ్ వైడ్ టాప్ గ్రాసర్స్ లో 'అవతార్' లాంటి సీక్వెల్, 'అవెంజర్స్', 'స్పైడర్ మేన్' వంటి ఫ్రాంచైజెస్ చోటు సంపాదించుకోవడం విశేషం.. వరల్డ్ వైడ్ టాప్ టెన్ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో జేమ్స్ కేమరాన్ రూపొందించిన మూడు చిత్రాలు చోటు సంపాదించడం గమనార్హం! ఈ రికార్డ్ తో జేమ్స్ ఒక్కరికే సొంతమయింది.. మరి ఈ టాప్ టెన్ గ్రాసర్స్ వరుసను ఏ సినిమాలు మారుస్తాయో చూడాలి.