'బైకర్'.. భావోద్వేగాలతో కనెక్ట్ అవుతారు
ABN, Publish Date - Apr 02 , 2026 | 09:00 PM
‘బైకర్’లో నేను పోషించిన పాత్ర చాలా కీలకంగా ఉండి సినిమానే మలుపు తిప్పేలా ఉంటుంది’ అని అన్నారు హీరోయిన్ మాళవిక నాయర్.
‘బైకర్’(Biker)లో నేను పోషించిన పాత్ర చాలా కీలకంగా ఉండి సినిమానే మలుపు తిప్పేలా ఉంటుంది’ అని అన్నారు హీరోయిన్ మాళవిక నాయర్ (malavika nair). హీరో శర్వానంద్ (Sharwanand)తో కలసి ఆమె నటించిన చిత్రమే ‘బైకర్’. యువీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘బైకర్’ విశేషాలను ఆమె మీడియాతో పంచుకున్నారు.
‘దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ కథ చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. ఇందులో నా పాత్ర కూడా బలంగా ఉండడంతో వెంటనే ఓకే చేశా. నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఇదీ ఒకటవుతుంది. నటనకు మంచి ఆస్కారమున్న పాత్రను పోషించానన్న సంతృప్తితో ఉన్నా. ఓ బైక్ రేసర్ జీవితంతో పాటూ తండ్రీ కొడుకుల భావోద్వేగ ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుందీ చిత్రం. అభిలాష్ (Abhilash Reddy) కు దర్శకత్వం మీద మంచి కమాండ్ ఉంది. ప్రతీ సన్నివేశాన్ని పేపర్ మీద ఉన్న దాని కంటే మరింత బాగా తెరకెక్కించారు.
శర్వానంద్, రాజశేఖర్ (Dr Rajashekhar) ల నటన, సంగీతం, విజువల్స్ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఇందులోని భావోద్వేగాలతో కనెక్ట్ అవుతూనే రేసింగ్ సన్నివేశాలు వచ్చినప్పుడు ఫుల్‌గా థ్రిల్ అవుతారు. ఈ సినిమా కథ మూడు విభిన్న టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. దర్శకుడు సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తీశారు. ద్వితియార్థంలో వచ్చే మలుపులు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమా అన్ని వర్గాల వారూ మెచ్చేలా ఉండి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.