Akira Nandan: అకీరా హీరోగా తీసిన ఏఐ సినిమా తొలగించండి.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:40 AM
పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) వ్యక్తిత్వ హక్కుల రక్షణకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. అకీరా నందన్ అనుమతి లేకుండా ఆయన పేరు, స్వరం, ముఖకవళికలు, వ్యక్తిత్వాన్ని ఉపయోగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా రూపొందించిన కంటెంట్‌ను ప్రసారం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
‘ఏఐ లవ్‌స్టోరీ’ అనే చిత్రంతో పాటు అకీరా నందన్ గుర్తింపును వాడుతూ సోషల్ మీడియాలో ఉన్న ఇతర డీప్‌ఫేక్ కంటెంట్‌ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని జస్టిస్ తుషార్ రావు గెదెలా నేతృత్వంలోని ధర్మాసనం అడ్డుకుంది. అకీరా నందన్ తన వ్యక్తిగత గోప్యత, ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
తన ప్రమేయం లేకుండానే ఏఐ మార్ఫింగ్, డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా పూర్తి నిడివి గల సినిమాను రూపొందించి తనను ప్రధాన పాత్రలో చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు 11 లక్షలకు పైగా, ఇంగ్లీష్ వెర్షన్‌కు 24 వేలకు పైగా వ్యూస్ వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.