రూ. కోటి విరాళం.. రజనీకాంత్ హామీపై లతా రజనీకాంత్ స్పష్టత!

ABN , Publish Date - Aug 07 , 2026 | 08:52 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ భార్య, శ్రీ దయా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు లతా రజనీకాంత్ చెన్నైలో నిర్వహించిన ‘మక్కల్ మేడై – సిటిజన్ ప్లాట్‌ఫామ్’ అధికారిక వెబ్‌సైట్, సభ్యత్వ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latha Rajinikanth with Rajinikanth

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) భార్య, శ్రీ దయా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు లతా రజనీకాంత్ చెన్నైలో నిర్వహించిన ‘మక్కల్ మేడై – సిటిజన్ ప్లాట్‌ఫామ్’ (Makkal Medai - Citizens’ Platform) అధికారిక వెబ్‌సైట్, సభ్యత్వ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో స్థానిక సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ వేదికగా మీడియాతో మాట్లాడిన లతా రజనీకాంత్ (Latha Rajinikanth), గతంలో రజనీకాంత్ ఇచ్చిన ఒక ప్రధాన హామీపై స్పష్టత ఇచ్చారు.


గతంలో తమిళనాడు-కర్ణాటక మధ్య కావేరి నీటి వివాదం తీవ్రంగా ఉన్న సమయంలో, దక్షిణాది నదుల అనుసంధానం ప్రాజెక్టు అత్యంత కీలకమని రజనీకాంత్ అభిప్రాయపడిన సంగతిని ఆమె గుర్తు చేశారు. ఆ సమయంలో దక్షిణ భారత నదులను అనుసంధానించే ప్రాజెక్టు కోసం తన వ్యక్తిగత నిధుల నుంచి రూ.కోటి విరాళంగా ఇస్తానని సూపర్ స్టార్ ప్రకటించారు. ఈ హామీ గురించి తాజా కార్యక్రమంలో ప్రస్తావించగా.. ఆ మాటపై రజనీకాంత్ ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని లతా రజనీకాంత్ స్పష్టం చేశారు.


కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు పనులను ఎప్పుడు ప్రారంభించినా సరే.. ఇచ్చిన మాట ప్రకారం రజనీకాంత్ తక్షణమే రూ.కోటి విరాళాన్ని అందిస్తారని ఆమె పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు, ముఖ్యంగా రైతుల సంక్షేమం, నీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి రజనీకాంత్ ఎల్లప్పుడూ తనవంతు సపోర్ట్ అందిస్తూనే ఉంటారని ఆమె స్పష్టం చేశారు. లతా రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలతో సూపర్ స్టార్ అభిమానులు, రైతు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వార్తలను కూడా చదవండి:

‘ఓ మై డాగ్’.. ఆ డాగ్ ఎంత పని చేసింది.. రవీనా టాండన్ ధైర్యానికి నెటిజన్లు ఫిదా

హైప్‌ని అందుకోలేకపోతోన్న సుకుమార్ శిష్యులు

‘కొరియన్ కనకరాజు’ నాయికపైనే ఇప్పుడందరి చూపు..!

Updated Date - Aug 07 , 2026 | 08:52 PM