సోమాజిగూడ టూ జపాన్.. ఆర్ఎక్స్ 100 టైటిల్ వెనుక ఇంత కథ నడిచిందా
ABN, Publish Date - Jul 29 , 2026 | 05:44 PM
ఆర్ఎక్స్100, మంగళవారం వంటి సంచలన చిత్రాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు అజయ్ భూపతి.
ఆర్ఎక్స్100, మంగళవారం వంటి సంచలన చిత్రాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలో ఘట్టమనేని కుటుంబానికి చెందిన జయకృష్ణ (Ghattamaneni Jayakrishna) హీరోగా, రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని (Rasha Thadani) కథానాయికగా తెరకెక్కిన సరికొత్త చిత్రం శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram). మోహన్ బాబు విలన్ గా నటించిన ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ భూపతి తన కెరీర్‌కి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, తన డెబ్యూ కల్ట్ చిత్రం ఆర్ఎక్స్ 100 టైటిల్ సాధించడం కోసం పడిన కష్టాన్ని గుర్తుచేసుకున్నాడు. ' ఆర్ఎక్స్ 100 టైటిల్ గురించి ఛాంబర్ లో చెప్పగానే.. వారు అస్సలు ఒప్పుకోలేదు. మాకు సమస్య అవుతుంది. ఆ కంపెనీ వాళ్లు మా మీద కేసు వేస్తారు. మేము ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయం అని చెప్పారు. నిర్మాత కూడా వేరే టైటిల్ పెడదాం అన్నా కూడా ఆ టైటిల్ పెడితేనే పర్‌ఫెక్ట్‌గా కనెక్ట్ అవుతుందని ఆయనకు నచ్చచెప్పి యమహా ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడ వారు నన్ను వింతగా చూసి.. టైటిల్ కి పర్మిషన్ ఇవ్వడం మా చేతుల్లో లేదు. చెన్నైలో మెయిన్ ఆఫీస్ ఉంది. అక్కడకి వెళ్ళండి అని చెప్పారు. అక్కడికి వెళ్లి నా స్టోరీ మొత్తం చెప్తే నీ బాధ నాకు అర్ధం అవుతుంది. కానీ, నా చేతుల్లో కూడా ఏం లేదు. జపాన్ లో ఆ కంపెనీ పేటెంట్ హక్కులు తీసుకోవాలి అని చెప్పారు. నేను ఒక కథను అల్లి.. అదే స్టోరీ అని చెప్పి మెయిల్ పంపాను. 15 రోజుల్లో ఇండియా మొత్తం ఆర్ఎక్స్ 100 పేరును నేను వాడుకోవచ్చని పేటెంట్ హక్కులు ఇచ్చారు. దాన్ని తీసుకెళ్ళి ఛాంబర్ లో చూపిస్తే వాళ్లు షాక్ అయ్యారు. అలా ఆర్ఎక్స్ 100 టైటిల్ వచ్చింది' అని అజయ్ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు తన తదుపరి చిత్రం శ్రీనివాస మంగాపురం విజయంపై అజయ్ భూపతి ఎంతో ధీమాగా ఉన్నాడు. ఘట్టమనేని జయకృష్ణ, రాషా తడాని ఇద్దరికీ ఇది డెబ్యూ చిత్రం కావడంతో పాటు, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచేయగా, జూలై 30న థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.