మళ్లీ.. 'వాల్తేరు వీరయ్య కాంబో! కోన వెంకట్‌కు.. గత వైభవం వచ్చేనా
ABN, Publish Date - Mar 24 , 2026 | 10:01 PM
టాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్ర రచయితగా చక్రం తిప్పిన కోన వెంకట్ (Kona Venkat), మరోసారి తన కలం పవర్‌ను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.
టాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్ర రచయితగా చక్రం తిప్పిన కోన వెంకట్ (Kona Venkat), మరోసారి తన కలం పవర్‌ను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. 'ఢీ', 'రెడీ', 'దూకుడు' వంటి సినిమాలతో టాలీవుడ్‌లో సరికొత్త కామెడీ ట్రెండ్‌ను సెట్ చేసిన ఆయన, కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక రేసులో కాస్త వెనకబడ్డారు. అయితే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)-బాబీ (Bobby Kolli) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్టుకు రచనా సహకారం అందిస్తూ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ క్రేజీ ప్రాజెక్టుతో తన పూర్వ వైభవాన్ని చాటుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు.
రచయితగా కోన వెంకట్ ప్రయాణం 'సత్య' వంటి డబ్బింగ్ సినిమాలతో మొదలైనప్పటికీ, శ్రీను వైట్లతో ఆయన కుదిరిన బంధం తెలుగు సినిమా గమనాన్ని మార్చేసింది. వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, మినిమమ్ గ్యారెంటీ ఫార్ములాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. చిత్ర పరిశ్రమలో మార్పులు సహజం కాబట్టి, కొత్త తరం దర్శకుల రాకతో ఆయన హవా కొంత తగ్గినట్లు అనిపించినా, కథపై ఆయనకు ఉన్న పట్టు ఏమాత్రం తగ్గలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
దర్శకుడు బాబీకి, కోన వెంకట్ అంటే కేవలం ఒక రచయిత మాత్రమే కాదు, ఒక 'గాడ్ ఫాదర్'. అందుకే బాబీ తన విజయాల్లో కోన భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్త పడతారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'జై లవకుశ', 'వాల్తేరు వీరయ్య' వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, చిరంజీవితో చేయబోయే తర్వాతి చిత్రానికి కూడా కోన వెంకట్‌నే రచయితగా ఎంచుకున్నారు బాబీ. ఈ హిట్ కాంబోపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల తన నిర్మాణంలో తెరకెక్కిన 'బ్యాండ్ మేళం' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కోన వెంకట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'ఈ సినిమా మీకు నచ్చకపోతే, నేను రైటర్‌గా చేసే తర్వాత సినిమాను చూడకండి' అంటూ ఒక క్రేజీ ఛాలెంజ్ విసిరారు. ఆ వెంటనే నవ్వుతూ..'ఆ తర్వాతి సినిమా చిరంజీవి గారితోనే ఉంటుంది, ఒకవేళ మీరు నా మాట విని థియేటర్‌కు రాకపోతే మెగాస్టార్ నన్ను తిడతారు' అని అసలు విషయాన్ని బయటపెట్టారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ మాస్ ఇమేజ్, బాబీ మేకింగ్ స్టైల్, దానికి తోడు కోన వెంకట్ మార్క్ పంచ్ డైలాగులు తోడైతే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. తనపై తనకు ఉన్న నమ్మకాన్నే ఆయన ఛాలెంజ్ రూపంలో వ్యక్తం చేశారు. రాబోయే ఈ చిత్రం కోన వెంకట్ కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని, అలాగే 'వాల్తేరు వీరయ్య' వంటి మేజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.