అమీర్ లోగ్ మూవీ చూశాక..హైదరాబాద్ మనుషుల మీద ప్రేమ, గౌరవం పెరుగుతుంది
ABN, Publish Date - Jul 25 , 2026 | 09:58 PM
రమణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అమీర్ లోగ్ చిత్రం ఆగస్ట్ 21న విడుదల కానుంది.
హైదరాబాద్ నగర సంస్కృతి, బస్తీల జీవన విధానం, అక్కడి మనుషుల మధ్య ఉండే అనుబంధాలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంగా రూపొందిన చిత్రం ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ, 'అవ్వల్ దావత్' పాటను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తమ అనుభవాలను పంచుకుంది.
దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఎన్నో ప్రాంతాల్లో జీవించిన అనుభవంతో అక్కడి మనుషుల నిజమైన జీవితాన్ని ఈ సినిమాలో చూపించామని తెలిపారు. "డబ్బు ఉన్నవారే అమీర్‌లు కాదు.. మనసారా జీవించే వాళ్లే నిజమైన అమీర్‌లు అనే భావనను ఈ చిత్రం చెబుతుంది. సినిమా చూసిన తర్వాత హైదరాబాద్ ప్రజలపై ప్రేక్షకులకు మరింత ప్రేమ, గౌరవం పెరుగుతుంది" అని అన్నారు.
నిర్మాత మాధవి రెడ్డి మాట్లాడుతూ, సినిమాలో చూపించిన బస్తీలోనే తాను పెరిగానని, ఆ అనుభవాలే ఈ చిత్రానికి బలమయ్యాయని చెప్పారు. ప్రేక్షకులు కొత్త తరహా కథను ఆదరించి చిత్ర బృందాన్ని ప్రోత్సహించాలని కోరారు. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి మాట్లాడుతూ, హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
నటి వేధా జలంధర్ మాట్లాడుతూ, బస్తీల్లో ఉండే బంధాలను ఎంతో సహజంగా తెరకెక్కించారని, ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరూ తమ జీవితంతో ఏదో ఒక విధంగా అనుసంధానం చేసుకుంటారని తెలిపారు. హీరో ఎంసీ హరి మాట్లాడుతూ, విడుదలైన 'అవ్వల్ దావత్' పాటకు మంచి స్పందన వస్తోందని, సినిమా ప్రేక్షకులను హైదరాబాద్ బస్తీల ప్రపంచంలోకి తీసుకెళ్తుందని అన్నారు.నటుడు మనోజ్ మాట్లాడుతూ, హైదరాబాద్ మనుషుల స్వభావం, బిర్యానీపై ప్రేమ, క్రికెట్‌పై ప్యాషన్ వంటి అంశాలను ఈ చిత్రం సహజంగా చూపిస్తుందని చెప్పారు.
శశిధర్ మాట్లాడుతూ, తాజాగా విడుదలైన పాటకు స్మరణ్ సాయి సంగీతం, మనోజ్ కుమార్ సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ఇది పూర్తి స్థాయి హైదరాబాద్ నేపథ్యంలో సాగే సినిమా అని అన్నారు.నటుడు సాయి యోగి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు ఉన్న గుర్తింపు లాగే ఈ చిత్రానికి కూడా మంచి పేరు వస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.నటి కీర్తి చిత్ర బృందంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని చెబుతూ, ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరించాలని కోరారు. లిరిసిస్ట్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, దక్కని యాసలో పాట రాయడం తనకు కొత్త అనుభవమని, సినిమా సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు.