హరీశ్ శంకర్ క్రేజీ లైనప్.. చిరంజీవితో మాస్ మూవీ
ABN, Publish Date - Mar 19 , 2026 | 09:12 AM
మెగాస్టార్ చిరంజీవితో ఒక పూర్తి స్థాయి మాస్ సినిమా చేయాలనేది చాలా మంది దర్శకుల కల. హరీశ్ శంకర్ కూడా అదే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) కలయికలో రూపొందిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా హరీశ్ శంకర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ వృత్తి పట్ల చూపించే అంకితభావం గురించి వివరిస్తూనే, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో తన భవిష్యత్ ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవితో ఒక పూర్తి స్థాయి మాస్ సినిమా చేయాలనేది చాలా మంది దర్శకుల కల. హరీశ్ శంకర్ కూడా అదే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన స్పందిస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ చూసిన తర్వాత చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేసి తనతో దాదాపు 20 నిమిషాలు మాట్లాడారని వెల్లడించారు. ట్రైలర్‌లో డైలాగులు అద్భుతంగా ఉన్నాయని, పవన్ కల్యాణ్ చాలా అందంగా కనిపిస్తున్నారని చిరు ప్రశంసించారట. ఆ సంభాషణ ముగిసిన తర్వాత చిరంజీవికి పవన్ కల్యాణ్ కేవలం తమ్ముడు మాత్రమే కాదు, ఒక కొడుకు లాంటి వారని తనకు అర్థమైందని, ప్రతి షాట్ గురించి ఆయన ఎంతో మురిసిపోతూ మాట్లాడారని హరీశ్ శంకర్ ఎమోషనల్ అయ్యారు.
చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి చెప్తూ, ఇప్పటికే ఆయనతో కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేసినట్లు హరీశ్ గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్‌తో తాను చేయబోయే సినిమా ప్రస్తుతం చర్చల దశలో ఉందని, అది ఖచ్చితంగా ఒక ‘రౌడీ అల్లుడు’, ‘దొంగ మొగుడు’, ‘గ్యాంగ్ లీడర్’ తరహాలో ఉంటుందని భరోసా ఇచ్చారు. చిరంజీవి మార్క్ మాస్ మేనరిజమ్స్, వింటేజ్ టైమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక పక్కా కమర్షియల్ కథను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక సగటు అభిమాని మెగాస్టార్‌ను వెండితెరపై ఎలా చూడాలని కోరుకుంటారో, తన సినిమా కూడా అలాగే ఉంటుందని స్పష్టం చేశారు.
గతంలో పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్లు కూడా చిరంజీవితో సినిమా కోసం ప్రయత్నాలు చేసిన విషయం విధితమే. ముఖ్యంగా ‘ఆటో జానీ’ అనే స్క్రిప్ట్‌తో పూరి విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, సెకండ్ హాఫ్ విషయంలో చిరుకు కొన్ని సందేహాలు ఉండటంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడు హరీశ్ శంకర్ చెప్పినట్లుగా చిరంజీవితో ఆ స్థాయి వింటేజ్ మాస్ సినిమా సాధ్యమవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కల్యాణ్‌తో చేసిన సినిమాలు ఘనవిజయం సాధించడం, ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై సానుకూల పవనాలు కనిపిస్తుండటంతో చిరంజీవి కూడా హరీశ్‌కు త్వరలోనే అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తర్వాత హరీశ్ శంకర్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నందమూరి బాలకృష్ణతో ఒక భారీ యాక్షన్ డ్రామాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. బాలయ్య సినిమా పూర్తయిన తర్వాతే మెగాస్టార్ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. వరుసగా మెగా హీరోలు, నందమూరి హీరోలతో సినిమాలు చేస్తూ హరీశ్ శంకర్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, మెగాస్టార్‌తో ఆయన కలయిక మరింత త్వరగా జరిగే అవకాశం ఉంటుంది.