Ram Charan: బుచ్చిబాబుతో అయిపోయింది.. మరో సుకుమార్ శిష్యుడిని లైన్‌లో పెట్టిన రామ్ చరణ్
ABN, Publish Date - Jun 14 , 2026 | 09:54 PM
'పెద్ది' విజయానంతరం రామ్ చరణ్ తన తదుపరి చిత్రాలను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్‌తో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమా చేయనున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
'గేమ్ ఛేంజర్' వంటి ప్లాప్ తర్వాత 'పెద్ది' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించి, మాసివ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో తన సత్తా చాటారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ప్రస్తుతం అదే ఊపుతో తన రాబోయే చిత్రాల లైన్అప్‌ను నెక్ట్స్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే క్రేజీ డైరెక్టర్ సుకుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్, తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేతులు కలిపారనే వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారుతున్న ఈ కాంబో సెట్ అయితే, థియేటర్లలో మరో భారీ యాక్షన్ విజువల్ వండర్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
ఇక్కడ విశేషం ఏంటంటే.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) మరెవరో కాదు, రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తెకెక్కించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) శిష్యుడే. గురువు సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సనాతో చరణ్ ఇప్పటికే 'పెద్ది' సినిమా చేసి భారీ హిట్ కొట్టారు. ఇప్పుడు గురువు సుకుమార్‌తో సినిమా లైన్ లో ఉండగానే, ఆయన మరో శిష్యుడైన శ్రీకాంత్ ఓదెలతో కూడా చరణ్ ప్రాజెక్ట్ లాక్ చేయడం ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గురువుతో సినిమా కాగానే.. వెంటనే శిష్యుడితో సినిమా అనే ఈ క్రేజీ లైన్అప్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
నేచురల్ స్టార్ నానితో ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ పీరియాడిక్ సినిమాను తెరకెక్కించి, మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు ఆయన రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌కు సరిపోయేలా, అంతకుమించిన ఒక పవర్‌ఫుల్, మైండ్ బ్లోయింగ్ ఊరమాస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో ‘ది ప్యారడైజ్’ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి అయిన తర్వాత మెగా పవర్ స్టార్‌తో తన నెక్ట్స్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గతంలో ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా, తాజాగా 'పెద్ది' సినిమాలో రా అండ్ రస్టిక్ లుక్‌లో చరణ్ నటనకు ఫ్యాన్స్ పూర్తిగా ఫిదా అయిపోయారు. అయితే, ఇప్పుడు ప్రచారంలో ఉన్న శ్రీకాంత్ ఓదెల సినిమాలో ఈ రెండు చిత్రాలను మించిపోయేలా అత్యంత భయంకరమైన క్యారెక్టరైజేషన్‌ను చరణ్ కోసం డిజైన్ చేశారట. శ్రీకాంత్ మార్క్ రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్‌కు, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా ఇది ఉండబోతుందనే ప్రచారం జోరందుకుంది. రెండు భారీ ప్రాజెక్ట్‌ల తర్వాత ఈ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉన్నందున, మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.