DADA: బాలయ్య.. రంగంలోకి దిగాడయ్యా
ABN, Publish Date - Oct 06 , 2026 | 03:53 PM
గాయం నుంచి కోలుకున్న నటసింహం బాలయ్య మళ్లీ గర్జించడానికి సిద్ధమయ్యారు.
గాయం నుంచి కోలుకున్న నటసింహం బాలయ్య మళ్లీ గర్జించడానికి సిద్ధమయ్యారు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) తన తాజా చిత్రం దాదా (Dada) సెట్స్‌లోకి పూర్తి ఎనర్జీతో తిరిగి అడుగుపెట్టారు. కాకినాడ పోర్ట్ యాక్షన్ సీక్వెన్స్ సమయంలో తగిలిన గాయం వల్ల ఏర్పడిన విరామానికి తెరదించుతూ, నేటి నుంచే సరికొత్త షెడ్యూల్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే, గాయం ఎంత తీవ్రమైనదైనా ఆయన సంకల్పం ముందు చిన్నబోయింది. వైద్యుల పర్యవేక్షణలో కొద్ది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న బాలకృష్ణ, పక్కా ప్రణాళికతో ఫిట్‌నెస్ సాధించారు. గాయం తాలూకు ఆనవాళ్లు ఏమాత్రం కనిపించకుండా, రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు నుంచే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.
నందమూరి బాలకృష్ణ అంటేనే అలుపెరగని ఉత్సాహం, తిరుగులేని అంకితభావం. వయసుతో సంబంధం లేకుండా దూసుకెళ్లే ఆయన దూకుడుకు చిన్న బ్రేక్ పడింది. కొద్దిరోజుల క్రితం కాకినాడ పోర్ట్ పరిసరాల్లో అత్యంత భారీ ఎత్తున రిస్కీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన కాలికి బలమైన గాయమైంది. వైద్యుల సూచన మేరకు మోకాలికి చిన్నపాటి శస్త్రచికిత్స కూడా జరిగింది. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు అభిమానుల్లోనూ కాస్త ఆందోళన వ్యక్తమైంది.
ఈ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అసాధారణమైనది. వీరసింహారెడ్డి వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దాదా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మాస్ పల్స్ బాగా తెలిసిన గోపీచంద్ మలినేని, ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే, ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. మరో విశేషమేమిటంటే, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఇందులో అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే అదిరిపోయే బాణీలను సిద్ధం చేయడమే కాకుండా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇక ఇప్పటికే షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చిన టీమ్, విడుదల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుకున్న సమయానికే, అంటే డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తెచ్చేందుకు చిత్రబృందం రాత్రీపగలూ శ్రమిస్తోంది. నేటి నుంచి మొదలైన కొత్త షెడ్యూల్‌లో టాకీ పార్ట్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న కీలక సన్నివేశాలను నాన్‌స్టాప్‌గా పూర్తి చేయనున్నారు.