సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్.. 15 ఏళ్ల తర్వాత చైతూ, సుకుమార్ కాంబో మ్యాజిక్ చేస్తుందా?

ABN, Publish Date - Nov 18 , 2026 | 01:12 PM

నాగచైతన్య, కార్తీక్ వర్మ దండు కాంబినేషన్‌లో వస్తున్న వృషకర్మపై భారీ అంచనాలు ఉన్నాయి.

Vrushakarma

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) కెరీర్‌లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ వృషకర్మ (Vrushakarma). 'విరూపాక్ష' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్, టీజర్‌తో సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకింది. డిసెంబర్ 4న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ ఒకే ఒక్క అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదే.. 'వృషకర్మ' పాన్ ఇండియా సక్సెస్ వెనుక సుకుమార్ బ్రాండ్ ఎంతవరకు పనిచేయబోతోంది?.

సుకుమార్, నాగచైతన్య కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమా '100% లవ్'. 2011లో వచ్చిన ఆ సినిమా చైతూ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ 'వృషకర్మ' కోసం చేతులు కలిపారు. కాకపోతే ఈసారి సుకుమార్ దర్శకుడిగా కాకుండా, ఒక బలమైన నిర్మాతగా చైతూకి అండగా నిలబడ్డారు. ఇక్కడే అసలు కథ మొదలైంది.

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రాజమౌళి తర్వాత ఆ రేంజ్ క్రేజ్, మార్కెట్ సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్. ముఖ్యంగా 'పుష్ప' సిరీస్, అందులోనూ 'పుష్ప 2' నార్త్ ఇండియాలో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. హిందీ ప్రేక్షకులకు సుకుమార్ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. మరోవైపు హీరో నాగచైతన్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, హిందీ బెల్ట్‌లో ఇంకా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. సరిగ్గా ఇక్కడే సుకుమార్ ఇమేజ్ 'వృషకర్మ'కు అతిపెద్ద ప్లస్ పాయింట్ కాబోతోంది. 'సుకుమార్ నిర్మిస్తున్న సినిమా' అనే ఒక్క ట్యాగ్ లైన్‌తో నార్త్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

కేవలం నిర్మాతగా పేరు వేసుకోవడమే కాదు, సినిమా కంటెంట్ విషయంలోనూ సుకుమార్ మార్క్ కచ్చితంగా ఉంటుంది. గతంలో కార్తీక్ దండు తీసిన 'విరూపాక్ష' సినిమాకు సుకుమార్ కథన సహకారం అందించారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు కార్తీక్ తన రెండో సినిమాను అంతకుమించిన స్థాయిలో, పురాణాలతో ముడిపడిన ఒక మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ తరహా మైథలాజికల్ మిస్టరీ జానర్‌కు భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది. కార్తీక్ మేకింగ్‌కు, సుకుమార్ స్క్రీన్‌ప్లే సూచనలు తోడైతే అవుట్‌పుట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 'వృషకర్మ'కు భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది.

కానీ, అసలు పరీక్ష అంతా హిందీ మార్కెట్‌లోనే ఉంది. ఒక సినిమా నార్త్‌లో నిలబడాలంటే కేవలం కంటెంట్ ఉంటే సరిపోదు.. సరైన ప్రమోషన్లు, భారీగా థియేటర్ల రిలీజ్ కూడా చాలా ముఖ్యం. అక్కడ సుకుమార్‌కు ఉన్న పరిచయాలు, 'పుష్ప' ద్వారా ఆయన సంపాదించుకున్న డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ 'వృషకర్మ'కు కచ్చితంగా ఉపయోగపడతాయి. మొత్తానికి, 15 ఏళ్ల తర్వాత కలిసిన చైతూ - సుకుమార్ కాంబినేషన్, కార్తీక్ దండు విజన్ 'వృషకర్మ'పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. సుకుమార్ బ్రాండ్ వాల్యూతో హిందీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏ స్థాయిలో బిజినెస్ చేస్తుందో, చైతూకి మొదటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందిస్తుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - Nov 18 , 2026 | 01:12 PM