ఉజ్జయిని మహంకాళి.. అమ్మవారిని దర్శించుకున్న వైష్ణవి చైతన్య!
ABN, Publish Date - Aug 02 , 2026 | 09:42 PM
ప్రముఖ సినీ నటి వైష్ణవి చైతన్య ఆదివారం సికింద్రాబాద్ లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రముఖ సినీ నటి వైష్ణవి చైతన్య (vaishna vichaitanya) ఆదివారం సికింద్రాబాద్ (Secunderabad) లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahankali Temple) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ బోనాల సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆమె సంప్రదాయ వస్త్రధారణలో భక్తిశ్రద్ధలతో బోనం (Bonalu 2026) సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి వచ్చిన వైష్ణవి చైతన్యకు భక్తులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో కొంతసేపు ప్రార్థనలు చేసిన ఆమె, కుటుంబ సభ్యుల సంక్షేమంతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిసింది. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
వైష్ణవి చైతన్య బోనం సమర్పించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో ఆమె కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. పలువురు నెటిజన్లు "తెలుగు సంప్రదాయాన్ని చక్కగా చాటిచెప్పారు", "అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'బేబీ' సినిమాతో భారీ గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య, ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కెరీర్‌లో మంచి అవకాశాలు అందుకుంటూనే, మరోవైపు సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ బోనాల వేడుకల్లో పాల్గొనడం అభిమానులను మరింత ఆకట్టుకుంది.
ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు తెలంగాణలో విశేష ప్రాధాన్యం ఉంది. ప్రతి ఏడాది సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గతంలో బేబీ సినిమాతో పాటు పలుమార్లు వైష్ణవి చైతన్య కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు.