Teena Sravya: కుక్కకు తులాభారం.. వివాదంలో హీరోయిన్
ABN, Publish Date - Jan 21 , 2026 | 03:22 PM
నటి టీనా శ్రావ్య (Teena Sravya) వివాదంలో ఇరుక్కుంది. ఆమె చేసిన ఒక చిన్న పని.. భక్తుల మనోభావాలను దెబ్బతీసింది.
Teena Sravya: నటి టీనా శ్రావ్య (Teena Sravya) వివాదంలో ఇరుక్కుంది. ఆమె చేసిన ఒక చిన్న పని.. భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. కమిటీ కుర్రాళ్లు, ప్రీ వెడ్డింగ్ షో సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న టీనాపై ఆదివాసీ భక్తులు మండిపడుతున్నారు. అసలేం జరిగింది అంటే.. ప్రస్తుతం మేడారంలో సమ్మక్క - సారక్క జాతర జరుగుతున్న విషయం తెల్సిందే. అక్కడ.. బెల్లంతో తులాభారం చేయడం మొక్కు. తక్కెడలో ఒక పక్క బెల్లాన్ని, ఇంకోపక్క మనిషిని కూర్చోబెట్టి.. తూకం వేస్తారు. ఆ మనిషికి సమానంగా వచ్చిన బెల్లాన్ని ఆలయానికి సమర్పిస్తారు.
ఇక తాజాగా టీనా.. తన తల్లి, పెంపుడు కుక్కతో కలిసి సమ్మక్క- సారక్క ఆలయానికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్ళింది. అక్కడ టీనా.. తన పెంపుడు కుక్కకు తులాభారం చేయించింది. అక్కడ తక్కెడలో ఒకపక్క బెల్లాన్ని పెట్టి.. ఇంకోపక్క తన పెంపుడు కుక్కను కూర్చోబెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై ఆదివాసీ భక్తులు మండిపడుతున్నారు. ఇలా కుక్కకు తులాభారం చేయడం.. దేవతలను అవమానించినట్టే అని, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని చెప్పుకొస్తున్నారు.
అయితే టీనా తల్లి మాత్రం.. ఇది మొక్కులో భాగంగానే జరిగిందని చెప్పుకొస్తుంది. సాధారణంగా చాలామంది కుక్కలను, పిల్లులను కూడా తమ బిడ్డలుగా చూస్తారు. వాటికి పేర్లు పెట్టి, ఇంటి పేరును కూడా యాడ్ చేసి తమ కుటుంబంలోని సభ్యుడిగా చూస్తారు. అలానే టీనా కుటుంబం కూడా ఆ కుక్కను ఇంటి సభ్యుడిగా భావించి మొక్కు తీర్చుకున్నట్లు ఉన్నారు. వదిలేయండి అని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రమే ఆలయంలో ఇలాంటివి చేస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదా అని మండిపడుతున్నారు. మరి దీనిపై టీనా ఎలా స్పందిస్తుందో చేయాలి.