Srinidhi Shetty: చచ్చే సైన్యం లేకుండా.. గెలిచే యుద్ధం ఏది సార్?
ABN, Publish Date - Oct 28 , 2026 | 02:51 PM
వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47 గురించి శ్రీనిధి శెట్టి ఆసక్తికర విషయాలు వెల్లడించారు
'త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) గారి దర్శకత్వంలో నటించాలనే కోరిక నెరవేరింది. 'ఆదర్శ కుటుంబం' త్రివిక్రమ్, వెంకటేశ్ కు కొత్త జానర్. త్రివిక్రమ్ ఫిల్మోగ్రఫీని గమనిస్తే ఈ చిత్రం ఆయన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది' అని చెప్పారు శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). వెంకటేశ్ (Venkatesh) కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47. (Aadarsha Kutumbam House) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు.
సినిమా ఈనెల 30న విడుదలవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రీనిది శెట్టి మీడియాతో చిత్ర విశేషాలు పంచుకొన్నారు. ఈ చిత్రంలో నాది అమ్మ పాత్ర అయినప్పటికీ, సినిమాకు నో చెబుదామనే ఆలోచన క్షణమైనా రాలేదు. ఇలాంటి సినిమాలు, పాత్రలు అరుదుగా వస్తాయి. త్రివిక్రమ్, వెంకటేశ్ కాంబినేషన్ అంటేనే ఎంతో ప్రత్యేకం. ఇది క్రైమ్ కామెడీ మూవీ. డార్క్ కామెడీ ఉంటుంది. నేను మొదటి సారి కామెడీ పాత్ర చేశాను.
త్రివిక్రమ్ డైలాగుల్లో ఎంతో భావం ఉంటుంది. రైటింగ్లో ఆయన మ్యాజిక్ కనిపిస్తుంది. సినిమాలో ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన డైలాగులున్నాయి. 'చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సార్?' అనే డైలాగ్ నాకు మాత్రమే కాదు, అందరికీ బాగా నచ్చింది. వెంకటేశ్ అద్భుతమైన నటుడు. ఆయన కామెడీ టైమింగ్ గానీ, ఎమోషనల్ సీన్లలో యాక్టింగ్ గానీ గొప్పగా ఉంటుంది. ఆయనను మ్యాచ్ చేయడం సాధ్యం కాదు. కానీ నా వంతు ప్రయత్నం చేశాను.