సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ద‌బిడి.. దిబిడే! బాలకృష్ణ కొత్త సినిమాలో.. క్రేజీ హీరోయిన్

ABN, Publish Date - Mar 29 , 2026 | 03:19 PM

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Balakrishna

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఈ రెండో సినిమాపై నందమూరి అభిమానుల్లోనే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ 'NBK 111' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతుండగా, మళ్ళీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి (Dimple Hayathi) నటించనున్న ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇప్పటికే హీరోయిన్‌గా 'లేడీ సూపర్ స్టార్' నయనతార (Nayanthara) నటిస్తుండగా, రెండో హీరోయిన్ పాత్ర కోసం డింపుల్ హయాతిని మేకర్స్ ఎంపిక చేసినట్లు సమాచారం. డింపుల్ హయాతి పాత్ర గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

ఈమె పాత్ర సినిమా సెకండ్ హాఫ్‌లో ప్రవేశిస్తుందని, కథా గమనంలో ఆమె క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, నటనకు ఆస్కారమున్న పవర్‌ఫుల్ రోల్‌లో ఆమె కనిపించబోతోందని టాక్ విన్పిస్తోంది. బాలయ్య మార్క్ యాక్షన్ డ్రామాలో డింపుల్ హయాతి పాత్ర ఎలాంటి మలుపులు తిప్పుతుందో అని అభిమానులు ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఆమె పాత్ర సెకండ్ హాఫ్ అంతటా ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్‌ను క్రియేట్ చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల ఆయన 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. "గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది" అంటూ ధీమా వ్యక్తం చేశారు. బాలకృష్ణతో మళ్ళీ పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దుతున్నామని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. గోపీచంద్ మలినేని సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ చాలా బలంగా ఉంటాయి, అలాగే ఈ సినిమా కూడా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో నిండి ఉంటుందని స్పష్టమవుతోంది.

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే, సతీష్ కిలారు నిర్మాణంలో ఈ పీరియాడిక్ మూవీ భారీ బడ్జెట్‌తో నిర్మితం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పనులు వేగంగా మొదలయ్యాయి. సంగీత దర్శకుడు థ‌మన్ ఈ సినిమాకు ట్యూన్స్ అందిస్తున్నారు. బాలయ్య సినిమాలకు తమన్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఉంటుందో గత చిత్రాలే నిదర్శనం. ముంబై బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ మాస్ మూవీలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

Updated Date - Mar 29 , 2026 | 03:35 PM