Anandhi: అవకాశాల కోసం ఎవరినీ అడగను.. ఆనంది మనసులో మాట
ABN , Publish Date - Oct 18 , 2026 | 07:26 AM
ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం కలిగించేలా కృషి చేసిన అరుదైన బుర్రకథ కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’. ఆమె జీవితకథతో రూపుదిద్దుకున్న సినిమాలో టైటిల్ రోల్ చేసింది ఆనంది.
ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం కలిగించేలా కృషి చేసిన అరుదైన బుర్రకథ కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’ (garividi Lakshmi). ఆమె జీవితకథతో రూపుదిద్దుకున్న సినిమాలో టైటిల్ రోల్ చేసింది ఆనంది (Anandhi). ‘ఈ రోజుల్లో’, ‘బస్టాప్’ సినిమాలతో పరిచయమై, తమిళ తెరకు తరలిపోయిన ఆనంది ‘గరివిడి లక్ష్మి’గా ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా పలకరిస్తే... పంచుకున్న కొన్ని కబుర్లివి...
చదువే లక్ష్యంగా.. అనుకోకుండా సినిమాల్లోకి!
‘ఆట’ జూనియర్స్‌లో, ‘డాన్స్ ఇండియా డాన్స్’ షోలలో రక్షితగా నేను పరిచయం. అప్పుడు 9వ తరగతి చదువుతున్నా. దర్శకుడు మారుతి ఒక షోలో నన్ను చూసి సినిమా అవకాశం ఇచ్చారు. బాగా చదువుకోవాలని కోరిక ఉండటంతో... ఇష్టం లేకున్నప్పటికీ ఓకే చెప్పా. ఎందుకంటే ఆ సమయంలో నాకు బాగా చదువుకోవాలనే కోరిక ఉండేది. ఆ తర్వాత కూడా సినిమా అవకాశాలు వస్తే చేస్తా కానీ... నాకు నేనుగా అవకాశాల కోసం ఎవరినీ అడగొద్దని డిసైడయ్యా.

ఆమె ఎవరో నాకు తెలియదు...
నేను పుట్టి, పెరిగింది వరంగల్. పక్కా తెలంగాణ అమ్మాయిని. ‘గరివిడి లక్ష్మి’ స్క్రిప్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు... ఆవిడ గురించి కానీ, బుర్రకథ గురించి కానీ నాకు అస్సలు తెలియదు. కథ విన్నాక ఆమె జీవితం నిజంగా అందరికీ తెలియాలనిపించింది. పైగా తెలుగులో బయోపిక్స్ రావడం చాలా అరుదు. చాలా ఏళ్లకు ఒక బయోపిక్ వస్తుంటే... ఆ అవకాశాన్ని ఎలా వదులుకుంటా. ఆ విధంగా నేను లక్కీ అనే చెప్పాలి.
యాస నుంచి హావభావాల వరకు..
సాధారణంగా ఏ సీన్ ఇచ్చినా రెండు టేక్స్‌కి మించి తీసుకోను. కానీ మొదటిసారి ‘గరివిడి లక్ష్మి’ కోసం వర్క్‌షాప్ చేశా. ఆ పదాలు, యాస పట్టుకోవడం కాస్త కష్టమే. పైగా స్టేజీ మీద బుర్రకథ చెప్పడం అంతా సులువేం కాదు. అయితే బుర్రకథ చెప్పే విధానం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. చెప్పేవాళ్ల హావభావాలు, ఆ ఉత్సాహాన్ని పట్టుకోవడానికి చాలా వీడియోలు చూశా. కొందరు కళాకారుల్ని కలిశాను కూడా. ‘గరివిడి లక్ష్మి’గా కనిపించడానికి చాలా ప్రిపరేషనే జరిగింది.
తమిళమ్మాయి అనుకున్నారు...
ఏదో క్లిప్పింగ్ చూసి ఆడిషన్ కూడా లేకుండా తమిళ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. అయితే ఆ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పాలన్నారు. నాకు అప్పటికి ఒక్క ముక్క కూడా తమిళం రాదు. పైగా షూటింగ్లో అందరూ నాతో తమిళంలోనే మాట్లాడాలని డైరెక్టర్ చెప్పారు. దాంతో స్పాట్లో ఉన్నవాళ్లతో మాట్లాడుతూ తమిళం నేర్చుకున్నా. విచిత్రం ఏమిటంటే... మొదటి సినిమాతోనే అంతా నన్ను తమిళమ్మాయి అనుకున్నారు.

చాలెంజింగ్‌గా ఉండాలి..
హీరోయిన్‌గానే కాదు.. ప్రాధాన్యం ఉన్న ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి నేను సిద్ధం. అయితే పాత్ర చాలెంజింగ్‌గా అనిపించాలి. నెగిటివ్ షేడ్స్ ఉన్నా ఓకే. తమిళంలో నాకు అలాంటి అవకాశాలొచ్చాయి. అందుకే అక్కడే కంటిన్యూ అయ్యా. తెలుగులో ‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ప్రేమంటే’... వంటి విభిన్న సినిమాలు చేశా. వెబ్‌సిరీస్‌ల్లో కూడా నటించా.
కో డైరెక్టర్‌తో పరిచయం.. పెళ్లితో కొత్త జీవితం!
తమిళ సినిమాలు చేస్తున్న సమయంలో కో డైరెక్టర్ సోక్రటీస్‌తో పరిచయం ఏర్పడింది. ఒక జర్నీలో అనుకోకుండా మా ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. మా పెద్దలకు విషయం చెప్పాం. అందరూ అంగీకరించడంతో పెళ్లి జరిగింది. మాకు నాలుగేళ్ల బాబున్నాడు. పెళ్లి తర్వాత కూడా నేను సినిమాల్లో నటిస్తున్నానంటే నా భర్త ప్రోత్సాహం వల్లే.
ALSO READ:
Bombay Stories: 'బాంబే స్టోరీస్' ఓటీటీ మూవీ.. విశ్లేషణ
shiraz mehdi: చిన్న సినిమాలను.. చంపేస్తున్నారు
ఐశ్వర్య లక్ష్మిని ఇలా చూస్తే.. పిచ్చెక్కాల్సిందే