Suhas: చచ్చి బతికాం.. ఇంకెప్పుడు అలాంటి సినిమా చేయను
ABN, Publish Date - Sep 04 , 2026 | 05:51 PM
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ సుహాస్. కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి హీరోగా, విలన్ గా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపును అందుకుంటున్నాడు.
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ సుహాస్ (Suahas). కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి హీరోగా, విలన్ గా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపును అందుకుంటున్నాడు. తాజాగా సుహాస్ మండాడి సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. సూరి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి పుగజేంధి మతిమారన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 10 న ఈ సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతుంది.
కోస్తా తీరప్రాంత పడవల పందెంనేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సుహాస్ ఒక వైల్డ్ విలన్ తరహా విలక్షణమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన సుహాస్, క్లైమాక్స్ షూటింగ్ సమయంలో తమ చిత్రబృందం ఎదుర్కొన్న ప్రాణాంతకమైన అనుభవాలను వెల్లడించాడు. ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను దాదాపు 45 రోజుల పాటు సముద్రంలోనే చిత్రీకరించామని, ప్రతిరోజూ ఉదయమే పడవల్లో సముద్రంలోకి వెళ్లి, రోజంతా నీటిపైనే గడుపుతూ షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రానికి ఒడ్డుకు వచ్చేవారమని తెలిపాడు. సముద్రంలో అలల తీవ్రత, ఊహించని వాతావరణ మార్పుల వల్ల షూటింగ్ సమయంలో 4 నుంచి 5 సార్లు పడవలు బోల్తా పడ్డాయని, ఆ క్షణాల్లో ప్రాణాలు పోతాయేమోననే భయం కలిగిందని సుహాస్ ఎమోషనల్ అయ్యాడు.
కొన్నిసార్లు అసలు బతుకుతామో లేదో అనిపించిందని, ముఖ్యంగా క్లైమాక్స్ కోసం అయితే చచ్చి బతికామని చెప్పుకొచ్చాడు. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్ ఉన్న సినిమాలు చేయనని, ఎందుకంటే రిస్క్ కన్నా జీవితం చాలా ముఖ్యమని సుహాస్ తెలిపాడు. ఈ సినిమా కోసం సుహాస్ మొత్తం 130 రోజుల పాటు పనిచేశాడు. తన పాత్ర బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కోసం షూటింగ్‌కు ముందే 15 రోజుల పాటు ఒక తీరప్రాంత గ్రామంలో ఉంటూ ప్రత్యేక మేకోవర్ అయ్యాడు. తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో సుహాస్, సూరి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.