దిగి వచ్చిన రాజేంద్ర ప్రసాద్... ఎంజీఆర్ అభిమానులకు క్షమాపణలు...
ABN, Publish Date - Mar 13 , 2026 | 04:38 PM
ఇటీవల ఎంజీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ఇక మీదట ఇలాంటివి పునరావృతం కావని స్పష్టం చేశారు.
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన తప్పును గ్రహించారు. ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఎంజీఆర్ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. తమిళ ప్రజలను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ తమిళ భాషలోనే ఓ వీడియోను చేసి, మీడియాకు విడుదల చేశారు. ఇటీవల టి.ఎల్. కాంతారావు స్మారక పురస్కార కార్యక్రమంలో పొరపాటున తాను నోరు జారానని అంగీకరించారు. ఆ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన ఎంజీఆర్ అభిమానులకు సారీ చెబుతున్నానని అన్నారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 'అందరికీ నమస్తే.. నేను తెలుగు నటుడు రాజేంద్రప్రసాద్ ని. కొద్దిరోజుల క్రితం పాతతరం నటుడు కాంతారావు అవార్డ్ నాకు ఇచ్చారు. ఆ వేడుకలో జాలీగా మాట్లాడుతూ తమిళ సినిమా దేవుడు ఎ.జి.ఆర్ గారి గురించి మాట్లాడుతున్నపుడు ఓ పొరపాటు దొర్లింది. అది ఎవరు చేశారో ఏమో కానీ కావాలనే పెద్దది చేశారు. అలా ఆయన గురించి నేను మాట్లాడతానా!? అంత ధైర్యం నాకు ఎక్కడిది!? నేను మద్రాస్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్‌లో చదువుకునేటప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. మేము ఎలా నేర్చుకుంటున్నామో చూసిన వ్యక్తి ఆయన. ఎంజీఆర్ గారి గురించి తప్పుగా మాట్లాడే పరిస్థితిలో లేను. ఐనా మిస్ అయి నా నోటినుంచి వచ్చిన మాటలకు మీరెవరైనా ఫీలై ఉంటే నన్ను క్షమించగలరు. ఇక జీవితంలో ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడనని హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఈ తప్పును ఈ సారికి మన్నించండి. ఇంతటితో దీనిని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.