కార్తికేయ.. హీరోగా రమ్మంటే.. డైరెక్టర్ గా వచ్చాడే
ABN, Publish Date - Sep 16 , 2026 | 03:42 PM
టాలీవుడ్‌లో ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్‌నైట్ సంచలనంగా మారిన యువ హీరో కార్తికేయ గుమ్మకొండ.. ఆ తర్వాత హీరోగా మంచి మంచి అవకాశాలను అందుకున్నాడు కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాడు.
టాలీవుడ్‌లో ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్‌నైట్ సంచలనంగా మారిన యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda).. ఆ తర్వాత హీరోగా మంచి మంచి అవకాశాలను అందుకున్నాడు కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాడు. గ్యాంగ్ లీడర్, వలిమై వంటి పెద్ద సినిమాల్లో విలన్‌గా మెప్పించినా, హీరోగా సరైన బ్రేక్ కోసం వేచి చూశాడు. ఆ తర్వాత బెదురులంక 2012, భజే వాయు వేగం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ.. ఆ సినిమాలు పరాజయాన్ని అందుకున్నాయి. ఇక గత కొద్దికాలంగా కొత్త సినిమాల అప్‌డేట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు, సోషల్ మీడియా నెటిజన్లు కార్తికేయ ఏమైపోయాడు? అని ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.
అయితే ఈ గ్యాప్‌పై వస్తున్న రూమర్స్, ట్రోలింగ్స్‌కు కార్తికేయ అదిరిపోయేలా చెక్ పెట్టాడు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా కొత్త అవతారం ఎత్తి షాక్ ఇచ్చాడు. ఇప్పటికే టాలీవుడ్‌లో విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం వంటి యువ కథానాయకులు నటనతో పాటు స్వీయ దర్శకత్వం లేదా నిర్మాణంలో సినిమాలు తీస్తూ విజయం సాధిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో కార్తికేయ కూడా మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా మారి తనదైన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
తన కోసం తానే ఒక వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకుని, స్వీయ నిర్మాణంలో ఒక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు కార్తికేయ. నిశ్శబ్దంగా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి, బుధవారం పూజా కార్యక్రమాలతో సైలెంట్‌గా సినిమా ముహూర్త వేడుకను కూడా పూర్తి చేసి ఆశ్చర్యపరిచాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అతిత్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సైలెంట్‌గా రీఎంట్రీకి ప్లాన్ చేసిన కార్తికేయ, ఈసారి డైరెక్టర్‌గా ఏ స్థాయిలో సక్సెస్ అయి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతాడో వేచి చూడాలి.