సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అక్కినేని వారబ్బాయికి.. నందమూరి వారసుని 'మాట సాయం'!

ABN, Publish Date - Jul 06 , 2026 | 09:24 PM

నవతరం కథానాయకుల్లో యంగ్ టైగర్ యన్టీఆర్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న యన్టీఆర్ , ఇప్పుడు అక్కినేని అఖిల్ లెనిన్ మూవీకి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషంగా మారింది.

ntr akhil

నవతరం కథానాయకుల్లో యంగ్ టైగర్ యన్టీఆర్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న యన్టీఆర్ (N. T. Rama Rao Jr), ఇప్పుడు అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా రూపొందిన లెనిన్ (Lenin) మూవీకి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషంగా మారింది. తెలుగు చిత్రసీమలో నందమూరి, అక్కినేని కుటుంబాల స్థానం ప్రత్యేకమైనది. అందువల్ల ఇప్పుడు 'లెనిన్' సినిమా యన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రాబోవడం నందమూరి, అక్కినేని ఇద్దరి అభిమానులకూ ఆసక్తికరమైన అంశంగా మారింది.

అందుకే అమితాసక్తి..

నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య అనుబంధం 75 ఏళ్ళ నాటిది. అందువల్ల నటరత్న యన్టీఆర్, నట సమ్రాట్ ఏయన్నార్ మధ్య ఉన్న రిలేషన్ గురించి నేడు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. బాక్సాఫీస్ బరిలో పలుమార్లు పోటీపడ్డ ఈ ఇద్దరు మహానటులు, రియల్ లైఫ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మధ్యలో ఇద్దరి నడుమ కొన్ని విభేదాలు తలెత్తినా, అవి 'టీ కప్పులో తుఫాన్' లాంటివే అని చెప్పాలి.

అందువల్లే వారిద్దరూ కలసి 14 చిత్రాలలో నటించగలిగారు. అలాంటి నందమూరి, అక్కినేని కుటుంబాల్లోని కొందరు టాప్ స్టార్స్ నడుమ ప్రస్తుతం సరైన సఖ్యత లేదని వినికిడి. ఈ సమయంలో నటరత్న యన్టీఆర్ ఫ్యామిలీ మూడోతరం స్టార్ హీరో యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్ కుటుంబ మూడోతరం కథానాయకుడు అఖిల్ సినిమాకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం ప్రత్యేకతను సంతరించుకుంది. దాంతో సినీఫ్యాన్స్ లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.

గతంలోనూ జూనియర్ యన్టీఆర్ తన వ్యాఖ్యానం కోరిన వారి చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. శ్రీవాస్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రానికి 2010లో యన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇందులో హీరో ఇంట్రడక్షన్ కు యంగ్ టైగర్ వ్యాఖ్యానం అందించారు. ఈ సినిమా పెద్దగా అలరించలేక పోయినా, యన్టీఆర్ వాయిస్ ఓవర్ కోసం ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని వీక్షించారు. తరువాత తాను, రామ్ చరణ్ కలసి నటించిన రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' మూవీలో రామరాజు పాత్ర టీజర్ కోసం యన్టీఆర్ వ్యాఖ్యానం చేశారు.

2022లో వచ్చిన 'ట్రిపుల్ ఆర్' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2023లో సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తిక్ వర్మ దండు రూపొందించిన 'విరూపాక్ష' చిత్రానికి కూడా యంగ్ టైగర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ మూవీ సాయిధరమ్ చిత్రాల్లో బిగ్ హిట్ గా నిలచింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్ డమ్' చిత్రానికి కూడా యన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2025లో జనం ముందు నిలచిన 'కింగ్ డమ్' వారి మనసులు గెలుచుకోవడంలో సఫలీకృతం కాలేకపోయింది.

అలా యన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రూపొందిన చిత్రాల్లో 'ట్రిపుల్ ఆర్' ఆయన నటించిందే కాబట్టి లెక్కించలేం. ఆయన వ్యాఖ్యానంతో 'విరూపాక్ష' మాత్రమే ఘనవిజయం సాధించింది. మిగిలిన సినిమాలు సో సో గా సాగాయి. ఈ నేపథ్యంలో అఖిల్ 'లెనిన్'కు యన్టీఆర్ వాయిస్ ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి.

Updated Date - Jul 06 , 2026 | 09:37 PM