క్రిస్మస్‌కి.. మాస్ వార్! కింగ్ 100 Vs దాదా.. గెలుపెవరిది?
ABN, Publish Date - Sep 08 , 2026 | 09:15 PM
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సమరానికి వేళయైంది. దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న ఇద్దరు సీనియర్ దిగ్గజాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో సినీ వర్గాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సమరానికి వేళయైంది. దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న ఇద్దరు సీనియర్ దిగ్గజాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో సినీ వర్గాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఒకవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna).. మరోవైపు కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna). రాబోయే క్రిస్మస్ సీజన్ కానుకగా డిసెంబర్ 24న ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ రేసులో ముఖాముఖీ పోటీ పడబోతున్నారు. దీంతో థియేటర్లలో ఏ స్థాయి రికార్డులు బద్దలవుతాయోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం కింగ్ 100 (King 100) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రాగా, నాగార్జున మార్క్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవి శ్రీ ప్రసాద్ ఇస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
గత ఏడాది నాగార్జున నటించిన 'కుబేర', 'కూలీ' సినిమాల్లో ఆయన పూర్తిస్థాయి సోలో హీరోగా కనిపించలేదు. అందుకే ఈ 100వ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పైగా ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్‌లో మంచి టైమ్ నడుస్తోంది. 'తండేల్'తో నాగచైతన్య, 'లెనిన్'తో అఖిల్ వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో, ఇప్పుడు కింగ్ నాగార్జున కూడా 'కింగ్ 100'తో బాక్సాఫీస్ వద్ద జెండా పాతడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న చిత్రం దాదా (Dada). వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన గ్లింప్స్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇందులో బాలయ్య బాబు మరోసారి పవర్‌ఫుల్ అండ్ స్టైలిష్ డాన్ పాత్రలో కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మాస్ ఎలిమెంట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గోపీచంద్ మలినేని-బాలయ్య కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో నందమూరి ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఈ 'దాదా' కూడా సేమ్ డిసెంబర్ 24నే థియేటర్లలోకి వస్తుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నాగార్జున, బాలకృష్ణ తమ కెరీర్‌లో ఒకే రోజున నేరుగా పోటీ పడింది ఇప్పటివరకు ఒక్కసారే. 1996 సంక్రాంతి రేసులో బాలకృష్ణ 'వంశానికొక్కడు', నాగార్జున 'వజ్రం' సినిమాలు సరిగ్గా ఒకే తేదీన విడుదలయ్యాయి. ఆ పోరులో 'వంశానికొక్కడు' విజయం సాధించింది. మళ్లీ సుదీర్ఘ కాలం తర్వాత డిసెంబర్ 24న ఈ ఇద్దరు దిగ్గజాలు బాక్సాఫీస్ వద్ద ఒకే రోజున ఢీకొనబోతున్నారు.
రెండు సినిమాలపై ఉన్న హైప్ చూస్తుంటే ఏ ఒక్కరూ తగ్గడానికి సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది. ఒకవైపు కింగ్ 100వ సినిమా ల్యాండ్‌మార్క్ మూవీ కావడం, మరోవైపు బాలయ్య మాస్ స్ట్రైక్ ఉండటంతో క్రిస్మస్ రేసు హాట్ హాట్‌గా మారింది. మరి ఈ ఇద్దరిలో ఎవరి సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందో చూడాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.