సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యస్వీ కృష్ణారెడ్డి అరుదైన ఘనత.. 75వ పుట్టినరోజున వరల్డ్ రికార్డ్

ABN, Publish Date - Jun 01 , 2026 | 10:44 PM

దర్శకుడు, సంగీత దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజున అరుదైన ఘనత సాధించారు. 38 సినిమాలకు దర్శకత్వం వహిస్తూ సంగీతం సమకూర్చిన రికార్డుతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

SV Krishna Reddy

జనం కోసం మనం అంటూ జనం మెచ్చే సినిమాలను రూపొందిస్తూ సాగారు యస్వీ కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy). జూన్ 1వ తేదీన యస్వీ కృష్ణారెడ్డికి 75 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా యస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ ఎఫ్.ఎన్.సి.సి.లో గ్రాండ్ గా జరిగాయి. ప్రస్తుతం ఆయన 'వేదవ్యాస్' అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. యస్వీకే ఆప్తమిత్రుడు కె. అచ్చిరెడ్డి ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని చేర్యాల మాజీ శాసనసభ్యుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయమవుతున్నారు. ఇదంతా ఓ విషయం కాగా, ప్రపంచంలోనే 38 సినిమాలకు దర్శకత్వం వహించి సంగీతం సమకూర్చిన ఘనతను యస్వీ కృష్ణారెడ్డి సాధించారు. అందువల్ల ఆయన పేరు 'తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు సంపాదించింది. అలా జూన్ 1న 75 ఏళ్ళు పూర్తి చేసుకోవడమే కాదు, ఓ వరల్డ్ రికార్డ్ నూ సొంతం చేసుకున్నారు యస్వీకె.

యస్వీ కృష్ణారెడ్డి పూర్తి పేరు సత్తి వెంకట కృష్ణారెడ్డి.. సినిమాల్లో నటించాలన్న అభిలాషతో చిత్రసీమలో అడుగుపెట్టారు... కళ్యాణ్ అనే పేరుతో 'పగడాల పడవ' అనే మూవీలో నటించారు. ఆ చిత్రం వెలుగు చూడలేదు. 1986లో చిరంజీవి 'కిరాతకుడు'లో ఓ విలక్షణ పాత్ర పోషించారు కృష్ణారెడ్డి.. ఆ సినిమా ఆకట్టుకోలేక పోయింది.. ఆ పై హైదరాబాద్ లో స్వీట్ షాప్ నడుపుతూనే సంగీతాభిలాషతో మ్యూజిక్ కోర్స్ చేశారు.. రాజేంద్రప్రసాద్ హీరోగా 'కొబ్బరిబొండాం' అనే చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యారు కృష్ణారెడ్డి. ఆ చిత్రానికి ఆయనే సంగీతం సమకూర్చారు.. తరువాత 'రాజేంద్రుడు-గజేంద్రుడు'తో దర్శకుడయ్యారు- ఆ మూవీకి కూడా మ్యూజిక్ అందించారు యస్వీకె... అప్పటి నుంచీ ఆయన దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు సంగీతం కూడా సమకూర్చారు. 'ఉగాది' సినిమాతో హీరో అయ్యారు.. అలా కథానాయకుడు కావాలన్న అభిలాషను స్వీయ దర్శకత్వంలో నెరవేర్చుకున్నారు.

'ఉగాది' తరువాత 'అభిషేకం' చిత్రానికి దర్శకత్వం వహించి సంగీతం సమకూర్చి ద్విపాత్రాభినయం చేశారు యస్వీ కృష్ణారెడ్డి. ఈ రెండు సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయి. యస్వీకే డైరెక్షన్ లో అనేక చిత్రాలు జనరంజకంగా తెరకెక్కాయి. దాదాపు అన్ని చిత్రాల్లోనూ కృష్ణారెడ్డి సంగీతం సైతం ఆకట్టుకుంది. 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు కృష్ణారెడ్డి. వాటిలో 38 సినిమాలకు ఆయనే సంగీత దర్శకుడు.ఇలా అలరించిన కృష్ణారెడ్డి తాజా చిత్రం 'వేదవ్యాస్'లో మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మిళితం చేస్తూనే సైన్స్ నూ జోడించి రూపొందిస్తున్నారు. పుట్టిన రోజున ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. 75 ఏళ్ళ వయసులో కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'వేదవ్యాస్'తో ఏ తీరున ప్రేక్షకులను మురిపిస్తారో చూడాలి.

Updated Date - Jun 01 , 2026 | 10:44 PM