73 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ .. షావుకారు జానకి అరుదైన రికార్డు! ఏయన్నార్, లలితా పవర్‌లను దాటి మరి కొత్త చరిత్ర
ABN, Publish Date - Aug 23 , 2026 | 11:10 PM
షావుకారు జానకి 73 ఏళ్ల సుదీర్ఘ నటనా ప్రస్థానంతో భారతీయ సినీ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఏయన్నార్, లలితా పవర్, పైడి జైరాజ్ కెరీర్లతో పోలిస్తే ఆమె ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి.
తెలుగు చిత్రసీమలోనే కాదు భారతదేశంలోనే అత్యధిక సంవత్సరాలు నటనాజీవితం కొనసాగించిన నటిగా షావుకారు జానకి (Sowcar Janaki) నిలిచారు... ఆమె నటించిన తొలి చిత్రం 'షావుకారు' 1950లో వెలుగు చూసింది. అప్పటి నుంచీ హీరోయిన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా దాదాపు 400 చిత్రాల్లో నటించారు జానకి... ఆమె చివరగా నటించిన చిత్రం 'అన్నీ మంచి శకునములే' 2023లో విడుదలయింది. అలా 73 ఏళ్ళ నటనాజీవితాన్ని కొనసాగించి ఏకైక నటిగా నిలిచారు జానకి. ఈమె కంటే ముందు హిందీ చిత్రసీమలో నటి లలితా పవర్ 70 ఏళ్ళ కెరీర్ తో రికార్డ్ నెలకొల్పారు. ఆమె రికార్డ్ ను షావుకారు జానకి అధిగమించారు... అలాగే నటుల్లో ఏయన్నార్, పైడి జైరాజ్ సుదీర్ఘ నటనాజీవితాన్ని చూశారు. వారందరినీ కూడా జానకి దాటేశారు. భారతీయ నటీనటుల్లో అత్యధిక కాలం నటనాజీవితాన్ని చవిచూసిన ఒన్ అండ్ ఓన్లీ యాక్టర్ షావుకారు జానకి అనే చెప్పాలి.
నటుల్లో.. ఏయన్నార్
భారతదేశంలో అత్యధిక కాలం నటనాజీవితాన్ని చవిచూసిన వారిలో ముందు పైడి జైరాజ్ ఉండేవారు. తెలుగువారైన జైరాజ్ హిందీ చిత్రాల్లో హీరోగా, కేరెక్టర్ యాక్టర్ గా రాణించారు. 1930 నుంచి 1995 వరకు ఆయన నటనాజీవితం సాగింది. అంటే మొత్తం 65 ఏళ్ళ నటనాజీవితం జైరాజ్ ది. ఆయన తరువాతి స్థానంలో 64 ఏళ్ళ కెరీర్ తో అశోక్ కుమార్ ఉండేవారు. వీరిద్దరినీ మన తెలుగు నటులు అక్కినేని నాగేశ్వరరావు అధిగమించారు. 1941లో 'ధర్మపత్ని' చిత్రంతో తొలిసారి తెరపై కనిపించారు ఏయన్నార్. 2013 దాకా ఏయన్నార్ నటిస్తూ సాగారు. ఏయన్నార్ చివరి చిత్రం 'మనం' ఆయన మరణించిన తరువాత 2014 మే 23న విడుదలయింది. అలా 72 ఏళ్ళ నటనాజీవితాన్ని చవిచూశారు ఏయన్నార్. భారతీయ నటుల్లో ఏయన్నార్ సుదీర్ఘమైన కెరీర్ సాగించారు. ఇప్పుడు ఈయనను కూడా జానకి దాటేయడం విశేషం.
ప్రపంచంలో.. కర్ట్ బోయిస్
సినిమాల్లో కాకుండా నాటకరంగం, టీవీల్లో కూడా కొందరు సుదీర్ఘ నటనాజీవితాన్ని గడిపారు. అయితే చిత్రసీమ విషయానికి వస్తే మన దేశంలో షావుకారు జానకి అంతటి సుదీర్ఘమైన కెరీర్ ఎవరికీ లేదనే చెప్పాలి. అయితే ప్రపంచ సినిమా రంగాన్ని పరిశీలిస్తే జర్మన్ నటుడు కర్ట్ బోయిస్ అందరి కంటే ఎక్కువ సంవత్సరాలు నటజీవితం కొనసాగించారు. 1908 నుండి 1987 వరకు కర్ట్ బోయిస్ తెరపై కనిపించి అలరించారు. అంటే మొత్తం 79 ఏళ్ళ నటజీవితం చూశారు ఆయన. కర్ట్ బోయిస్ బాల్యం నుంచే తెరపై కనిపించారు. ఆరంభంలో మూకీ లఘుచిత్రాల్లో నటించారు. 1987లో ఆయన నటించిన చివరి చిత్రం 'వింగ్స్ ఆఫ్ డిజైర్' రిలీజయింది. ఇప్పటిదాకా సుదీర్ఘ నటనాప్రస్థానం చూసిన ఏకైక చలనచిత్ర నటునిగా కర్ట్ బోయిస్ నిలిచారు.
ఎందరో మహానుభావులు..
చలన చిత్రసీమలో పలు అరుదైన రికార్డ్స్ విషయానికి వస్తే మన తెలుగువారికే ప్రపంచ ఖ్యాతి అధికమని చెప్పవచ్చు. లాంగెస్ట్ యాక్టింగ్ కెరీర్ లో నటుల్లో ఏయన్నార్, నటీమణుల్లో షావుకారు జానకి ఉన్నారు. అత్యధిక పౌరాణిక చిత్రాల్లో నటించిన ఏకైక నటునిగా యన్టీఆర్ ది ప్రపంచ రికార్డ్. జానపదాల్లోనూ ఆయనదే వరల్డ్ రికార్డ్. కాగా, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన రికార్డ్ దాసరి నారాయణరావు పరమైంది. లేడీ డైరెక్టర్స్ లో ఎక్కువ సినిమాలు తీసిన ఘనతను విజయనిర్మల సొంతం చేసుకున్నారు. అత్యధిక చిత్రాలు నిర్మించిన ఘనతను డి.రామానాయుడు దక్కించుకున్నారు. ఇలా చలనచిత్రసీమలో తెలుగువారి ఘనత దశదిశలా వెలుగులు విరజిమ్ముతోంది. అయినా ఈ గౌరవాలను మన తెలుగువారు గొప్పగా చెప్పుకోవడం లేదు. అదే విచారకరం.
నవతరం నడుం బిగించాలి..
వాస్తవానికి తెలుగు చలనచిత్రసీమ చరిత్ర మొదటి నుంచీ ఓ క్రమంలో అక్షరబద్ధం కాలేదు. అందువల్లే మన తొలి సినిమాగా చెప్పుకొనే 'భక్త ప్రహ్లాద' చిత్రం ఎప్పుడు రిలీజయిందో కూడా మొన్నటి దాకా సరిగా చెప్పలేకపోయేవారు. అలాంటి పంథాను వీడి మన గతవైభవాన్ని ప్రపంచానికి తెలియజేసే రోజులు రావాలి. ప్రస్తుతం తెలుగు సినిమా అంతర్జాతీయంగానూ వెలుగుతోంది. ఈ సమయంలో మన గత కీర్తిని చాటుకొనే ప్రయత్నం సాగించాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు రూపొందించడమే కాదు, మన ఘనకీర్తినీ స్మరించుకోవాలి. అందుకు నవతరం నడుం బిగించాలి.