The Paradise: అక్కడ మెగాస్టార్ వెనుకే నాని!

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:09 AM

విదేశాలలో తొలిరోజు వసూళ్ళలో దక్షిణాది భాషా చిత్రాలు విజయకేతనం ఎగరేస్తున్నాయి. ఈ యేడాది విడుదలై చిత్రాలలో టాప్‌ టెన్‌ స్థానంలో నాలుగు తెలుగు సినిమాలే కావడం విశేషం. ఈ జాబితాలో నాని 'ది ప్యారడైజ్‌' ఏడో స్థానంలో నిలిచింది.

The Paradise Movie

నేచురల్ స్టార్ నానికి ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ ఉంది. అతని సినిమాలు అమెరికాలో అతి సులువుగా మిలియన్‌ డాలర్స్ ను కలెక్ట్ చేసేస్తుంటాయి. తెలుగు హీరోలలో నానికి అమెరికాలో ఉన్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. అయితే... 'ది ప్యారడైజ్‌' మూవీకి వచ్చిన నెగెటివ్‌ టాక్‌ ప్రభావం ఓవర్సీస్‌ మార్కెట్ మీద ఏ మేరకు పడి ఉంటుందనే అనుమానులు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ యేడాది విడుదలై ఇండియన్ సినిమాలన్నింటి ఓపెనింగ్‌ డే గ్రాస్‌ లను చూసినప్పుడు నాని 'ది ప్యారడైజ్‌' గౌరవ ప్రదమైన స్థానంలోనే నిలిచింది. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో ఏడో స్థానం దక్కింది. 'ధురంధర్‌ 2' మూవీ ఈ యేడాది మార్చి 19న విడుదలైంది. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో తొలి రోజు 5.55 మిలియన్ డాలర్స్ గ్రాస్‌ దక్కింది. ఈ యేడాది ఈ సినిమా ప్రథమస్థానంలో నిలువగా ఆ వెనుకే మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌ నటించిన 'పెద్ది' 2.85 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలోనూ, విజయ్‌ తమిళ చిత్రం 'జన నాయగన్' 2.85 మిలియన్ డాలర్లతో ఆ తర్వాత స్థానంలోనూ నిలవగా, మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం 'దృశ్యం 3' తొలి రోజున ఓవర్సీస్‌లో 2.62 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత స్థానం డిజాస్టర్ టాక్‌ తెచ్చుకున్న తెలుగు సినిమా 'ది రాజా సాబ్‌'కు దక్కడం విశేషం. ఈ సినిమా ఓవర్సీస్‌లో తొలి రోజున 2.6 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.


ఈ సారి సంక్రాంతి విన్నర్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌ 'మన శంకర వర ప్రసాద్‌ గారు' సినిమా 2.25 మిలియన్‌ డాలర్లతో ఆరో స్థానంలో నిలవగా, ఏడో స్థానంలో నాని 'ది ప్యారడైజ్‌' 2.2 మిలియన్ డాలర్లతో నిలిచింది. ఎనిమిదో స్థానం సూర్య 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ ' సినిమా 1.45 మిలియన్‌ డాలర్లతో దక్కించుకుంది. ఇక తొమ్మిది, పది స్థానాలు 'పరాశక్తి, కరుప్పు' చిత్రాలు పొందాయి. ఆ తర్వాత పదకొండో స్థానంలో చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'బెత్లెహాం కుటుంబ యూనిట్‌' 1.08 మిలియన్ డాలర్లతో దక్కించుకుంది. మొత్తం మీద విదేశాలలో తొలి రోజు వసూళ్ళలో హిందీ చిత్రం 'ధురంధర్ 2' ఒక్కటే నిలువగా మిగిలిన పది స్థానాల్లోనూ దక్షిణాది భాషా చిత్రాలే నిలవడం విశేషం.

ఇవి కూడా చదవండి:

ఇక నో డౌట్.. ‘రణబాలి’ వచ్చేది ఫిక్స్.. న్యూ పోస్టర్ వైరల్

సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’.. మైండ్‌ బ్లోయింగ్‌ డీల్‌!

గతేడాది ఇదే టైమ్‌కి థియేటర్లలో ఫైర్ స్ట్రోమ్: సుజీత్ పోస్ట్ వైరల్

Updated Date - Sep 26 , 2026 | 11:15 AM