Prudhvi Raj: ‘కాస్ట్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు.. టోటల్ గవర్నమెంట్ వస్తుంది
ABN, Publish Date - Oct 12 , 2026 | 10:15 AM
వరుణ్ సందేశ్, గగన్ బాబు, సత్యం రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కాస్ట్’ టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
వరుణ్ సందేశ్, గగన్ బాబు, సత్యం రాజేశ్, రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సోషల్ డ్రామా చిత్రం ‘కాస్ట్’ (Caste Movie). ఏకే జంపన్న దర్శకత్వంలో తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కశిక కపూర్, దివి వద్యా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఆదివారం సాయంత్రం ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకుడు శివ నిర్వాణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘కాస్ట్’ టైటిల్ ఆసక్తికరంగా ఉందని, కుల వ్యవస్థపై సందేశంతో పాటు యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో సినిమా రూపొందించినట్లు నిర్మాత చెప్పారని తెలిపారు. టీజర్ చాలా బాగుందని ప్రశంసిస్తూ, సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలను విశాఖపట్నంలోనూ నిర్వహించాలని, ఈ సినిమా వేడుకను అక్కడ ఏర్పాటు చేయాలని కోరారు.
నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమాలో మంచి సందేశం ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నిర్మాతగా తొలి సినిమా చేస్తున్న కోటేశ్వరరావుకు అభినందనలు తెలిపి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. శివ నిర్వాణ మాట్లాడుతూ.. సినిమా నిర్మాణానికి ముందుకొచ్చే నిర్మాతలను గౌరవించాలని అన్నారు. కోటేశ్వరరావు తొలి ప్రయత్నం విజయవంతం కావాలని, దర్శకుడు జంపన్నకు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. టీజర్‌లో ఇంటెన్సిటీ కనిపిస్తోందని, సినిమా ద్వారా మంచి సందేశం అందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ.. టీజర్‌ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారని, త్వరలో పాటలు విడుదల చేస్తామని వెల్లడించారు. దర్శకుడు ఏకే జంపన్న మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అందరూ సమానంగా కూర్చునే థియేటర్ సంస్కృతిని కాపాడుకోవాలని అన్నారు. సినిమాలో నటీనటులందరూ చక్కగా నటించారని తెలిపారు.
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిదని, ప్రతి నటుడు తన పాత్రలో అద్భుతంగా నటించారని చెప్పారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించడం ఆనందంగా ఉందన్నారు. హీరో గగన్ బాబు మాట్లాడుతూ.. ‘కాస్ట్’లో కంటెంట్‌తో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయని, ప్రేక్షకులను అలరించే గూస్‌బంప్స్ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. సినిమాను థియేటర్లలో మిస్ కావద్దని కోరారు. నటుడు రవి ఈ కథ, నిర్మాత, దర్శకుడు, ప్రేక్షకులే సినిమాకు అసలైన బలమని పేర్కొన్నారు. సత్యం రాజేశ్, దివి వద్యా కూడా సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించాలని కోరారు.
చివరగా 30 ఇయర్స్ ఫృథ్వీ (Prudhvi Raj)మాట్లాడుతూ.. చిత్ర బృందాన్ని ప్రశంసించారు. నిర్మాత మమ్మల్ని మంచిగా చూసుకున్నారని, డబ్బు దండిగా ఇచ్చారని అన్నారు. నిర్మాతను చూస్తే సామాన్యుడిలా కనిపిస్తారని అతను మాములు వ్యక్తి కాదని ఇప్పుడు టీజర్‌కు ఎమ్మెల్యే గంటా గారు వచ్చారని కానీ రేపుట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు టోటల్ గవర్నమెంట్ ఇక్కడే ఉంటుందని కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో కుల వివక్ష లేదని మాదంతా సినిమా కులమని నేను ఇప్పుడు బాలీవుడ్‌లోనూ మెయిన్ విలన్‌గా చేస్తున్నానని, తమిళంలోనూ చాలా సినిమాలు చేస్తున్నానని అన్నారు. సమాజంలో కులం ఉండకూడదనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు. పవన్ కల్యాణ్‌కే లేని కాస్ట్ మనకెందుకండి అంటూ ముగించారు. కాగా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.