సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NBK112: బాలయ్య మూవీకి.. రూ.200 కోట్లు! నిర్మాతలు రిస్క్.. చేస్తున్నారా?

ABN, Publish Date - Jun 26 , 2026 | 11:27 AM

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ స్టామినా గత కొన్నేళ్లుగా ఏ స్థాయిలో ఊపందుకుందో తెలిసిందే.

Nandamuri BalaKrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) బాక్సాఫీస్ స్టామినా గత కొన్నేళ్లుగా ఏ స్థాయిలో ఊపందుకుందో తెలిసిందే. 'అఖండ' చిత్రంతో ఆయన మార్కెట్ అనూహ్యంగా విస్తరించింది. ఆ ఘన విజయం తర్వాత వచ్చిన 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' వంటి చిత్రాలు వరుసగా కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఈ క్రమంలో ఆయన క్రేజ్ ఐదేళ్ల క్రితం ఉన్నదానికంటే అనేక రెట్లు పెరిగిపోయింది. ఒకప్పుడు పరిమిత బడ్జెట్‌తో సినిమాలు చేసిన బాలయ్యతో ఇప్పుడు వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినా సునాయాసంగా రికవరీ చేయగలరనే భరోసా పరిశ్రమలో ఏర్పడింది. ఆయన మాస్ ఇమేజ్, బాక్సాఫీస్ పుల్ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే స్థాయికి చేరుకున్నాయి.

అయితే.. వంద కోట్లకు మించి బడ్జెట్ పెరిగితే ఆశించిన స్థాయిలో రాబడి వస్తుందా అనే విషయానికి 'అఖండ-2' ఫలితం ఒక హెచ్చరికలా నిలిచింది. ఈ భారీ సీక్వెల్ కోసం నిర్మాతలు దాదాపు రూ. 150 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సినిమాపై ఉన్న అంచనాలతో మేకర్స్ దీనిని భారీ రేట్లకు విక్రయించారు. కానీ, విడుదలయ్యాక సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో పెట్టుబడికి తగ్గ లాభాలు రాలేదు. ఈ పరిణామం అటు నిర్మాతలతో పాటు ఇటు బయ్యర్లకు కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ఈ ఫలితం తదుపరి ప్రాజెక్టులపైనా గట్టి ప్రభావాన్నే చూపించింది. 'అఖండ-2' విడుదలకు ముందే గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలయ్య ఒక భారీ పీరియాడిక్ కథను NBK111 పట్టాలెక్కించాల్సి ఉంది. దీని కోసం ఏకంగా రూ. 200 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆ పీరియాడిక్ కథను పక్కనపెట్టి, పెట్టుబడి భారాన్ని తగ్గించుకునేలా నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ పరిమితుల్లో ఉండేలా ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తోనే గోపీచంద్ మలినేనితో ముందుకు సాగుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ కొత్త సినిమా బడ్జెట్ వ్యవహారం మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో బాలయ్య తన NBK112 ప్రాజెక్టును మొదలుపెట్టారు. సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 25న ఈ సినిమా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. అయితే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం పరిశ్రమ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మార్కెట్ రియాలిటీని దృష్టిలో ఉంచుకుని మార్పులు జరుగుతున్న తరుణంలో, మళ్లీ ఇంత భారీ బడ్జెట్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.

బాలయ్య మార్కెట్ పరిధిని మించి ఇంత భారీ బడ్జెట్ కేటాయించడం పెద్ద సాహసమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అఖండ సీక్వెల్ రికవరీలోనే ఇబ్బందులు ఎదురైనప్పుడు కొరటాల శివ కాంబినేషన్‌పై ఇంత పెట్టుబడి పెట్టడం ఎంతవరకు సురక్షితమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు దర్శకుడు కొరటాల గత చిత్రం 'దేవరస‌ (Devara) మంచి వసూళ్లు సాధించినా, కొన్ని ఏరియాల్లో నష్టాలు మిగిల్చిందనే ప్రచారం ఉంది.

అంతేకాకుండా, నిర్మాత సుధాకర్ చెరుకూరి (Sudhakar cherukuri) ఇప్పటికే నాని 'ది ప్యారడైజ్' కోసం భారీగా ఖర్చు చేస్తూ ఒత్తిడిలో ఉన్నారని టాక్. ఇలాంటి తరుణంలో బాలయ్య సినిమాకు ఈ రేంజ్ ఖర్చును భరించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిర్మాతలు బడ్జెట్ విషయంలో పునరాలోచిస్తారా లేక కొరటాల-బాలయ్యల మ్యాజిక్‌పై నమ్మకంతో ముందుకెళ్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఈ కాంబినేషన్ సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు మాత్రం ఎంతో విశ్వాసంతో ఉన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 11:27 AM