‘సరస్వతి’.. ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తుంది
ABN, Publish Date - Mar 04 , 2026 | 07:26 AM
‘సరస్వతి’.. ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తుంది. రెండు గంటలపాటు ఉత్కంఠకు గురి చేస్తుందని పూజా శరత్‌కుమార్ అన్నారు.
‘థియేటర్లలో ప్రేక్షకులను ‘సరస్వతి’ (Saraswathi) సీట్లకు కట్టిపడేస్తుంది. రెండు గంటలపాటు ఉత్కంఠకు గురిచేస్తుంది. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్న వన్ ప్యాకేజ్ పటాక ఇది’ అని అన్నారు పూజా శరత్‌కుమార్ (Pooja Sarathkumar).
వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarath Kumar) ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. తన సోదరి వరలక్ష్మి శరత్‌కుమార్‌తో కలసి దోస డైరీస్ బ్యానర్‌పై పూజా శరత్‌కుమార్ నిర్మించారు. సినిమా ఈనెల 6న విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో పూజా చిత్ర విశేషాలు పంచుకున్నారు.
‘నాకు నిర్మాణంపై ఆసక్తి ఉంది. ఇప్పటివరకు ఎన్నో మ్యూజిక్ షోలు నిర్వహించాను. అందులో రెహ్మాన్ గారివి కూడా ఉన్నాయి. ‘సరస్వతి’ ఒక క్రైమ్ థ్రిల్లర్. చాలా మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ట్రైలర్‌లో ప్రతి ఒక అమ్మాయి సరస్వతిలా ఉండదు. సమయం వస్తే కాళీలా మారుతుంది అనే ఒక డైలాగ్ ఉంది.
ఈ కథ వెనుక ఉన్న ఆలోచన అదే. చాలా బలమైన కథ. వరలక్ష్మికి బాగా కనెక్ట్ అయిన కథ ఇది. వాటికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. వరలక్ష్మి ఇప్పుడు హైదరాబాద్ అమ్మాయి అయిపోయింది. తను దర్శకత్వం వహించే తొలి సినిమా తెలుగులోనే ఉండాలని బలంగా కోరుకుంది. ట్రైలర్ చూసి నందమూరి బాలకృష్ణగారు అభినందించారు’ అని అన్నారు.