‘జగమే సంగీతం’ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

ABN , Publish Date - Sep 02 , 2026 | 08:52 PM

భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి.

Jagamae Sangeetham Team Interview

భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి అరుదైన కర్ణాటక శాస్త్రీయ సంగీత నేపథ్యంలో రూపొందిన సరికొత్త వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). ఈ ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగా డాటర్ సుష్మిత కొణిదెల ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ‘18 పేజెస్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా.. ఈ చిత్ర బృందం NSR ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.


ఈ సందర్భంగా నిర్మాత సుష్మిత కొణిదెల (Sushmitha Konidela) మాట్లాడుతూ.. ‘‘హిందీలో వచ్చిన ప్రముఖ సిరీస్ 'బందిష్ బ్యాండిట్స్' చూసినప్పుడు చాలా నచ్చింది. దాన్ని కేవలం రీమేక్ చేయకుండా, మన కర్ణాటక సంగీతంలోని లోతైన కల్చర్‌తో, మన తెలుగు మూలాల నుంచి పుట్టిన కథగా తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందని భావించాం. సంగీతంతో రొమాన్స్ చేయగల అనుభవం, మెచ్యూర్డ్ ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యం ఉండటం వల్లే సూర్యప్రతాప్‌ను డైరెక్టర్‌గా ఎంచుకున్నాం. నా గత సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేర్’లో నటించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్‌లతో మళ్లీ పనిచేయడం కుటుంబంతో ఉన్నట్లే అనిపించింది. కథకు తగ్గ స్కోప్ ఉన్నందున ప్రైమ్ వీడియోతో చర్చించి భవిష్యత్తులో తప్పకుండా ‘సీజన్ 2’ కూడా తీసుకొస్తాం’’ అని స్పష్టం చేశారు.

సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) మాట్లాడుతూ.. ‘‘ఈ కథ వింటున్నప్పుడు, డైరెక్టర్ ప్రతాప్ చెప్పే విధానం చూసి నాకు దర్శకేంద్రుడు కె. విశ్వనాథ్ గారే గుర్తుకొచ్చారు. సంగీతంపై అంతటి లోతైన పట్టు లేకపోతే ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేయడం చాలా కష్టం. ‘స్వరాభిషేకం’ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు కర్ణాటక సంగీత విద్వాంసుడి పాత్ర చేశాను. ప్రకాష్ రాజ్, నా పాత్రల మధ్య సంగీత ఆధిపత్యం, ఫ్యామిలీ ఈగోలు, చక్కటి భావోద్వేగాల టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. తెరపై ఆ గమకాలు పాడుతూ లిప్ సింక్ చేయడం నిజంగా ఎంతో కష్టమైన, ఛాలెంజింగ్ టాస్క్’’ అని తన అనుభవాన్ని వివరించారు.


నటి మధుబాల (Madhubala) మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్‌లో నా పాత్రకు ఆరంభం నుంచి చివరి వరకు ఎన్నో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. కేవలం పోలీస్ లేదా పొలిటీషియన్ డ్రెస్ వేసుకుని అరిస్తేనే స్ట్రాంగ్ ఉమెన్ కాదు.., కుటుంబం కోసం నిశ్శబ్దంగా త్యాగం చేస్తూ ప్రేమను పంచే ఇంటి ఇల్లాలిగా సైలెంట్‌గా ఉంటూనే తన బలాన్ని చాటే పాత్ర ఇది. సాంప్రదాయ గురుకుల వాతావరణంలో విద్యను అభ్యసించే ఆ గొప్ప అనుభవాన్ని ఈ ప్రాజెక్ట్ ద్వారా పొందాను’’ అన్నారు. ఇక దర్శకుడు సూర్యప్రతాప్ మాట్లాడుతూ.. ‘‘కర్ణాటక సంగీతం మూలాలపై ఎంతో రీసెర్చ్ చేసి, విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన మ్యూజిక్‌తో ఈ సిరీస్‌ను తీర్చిదిద్దాం. నేటి Gen-Z యువతకు కూడా అర్థమయ్యేలా వినోదం, ప్రేమ, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మలిచాం. నా కెరీర్‌లో ఇదొక గొప్ప సెకండ్ ఇన్నింగ్స్’’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా టీమ్ చెప్పిన మరిన్ని విశేషాలను తెలుసుకునేందుకు పై వీడియోను చూడండి.

ఇవి కూడా చదవండి:

‘ఇరుముడి’.. స్కూల్ సీన్స్ కాంట్రవర్సీపై శివ నిర్వాణ క్లారిటీ

పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ

పవన్ కళ్యాణ్‌పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్

Updated Date - Sep 02 , 2026 | 08:52 PM