డైరెక్టర్ కమ్ హీరోస్.. కోలీవుడ్ లో కొత్త ట్రెండ్!
ABN, Publish Date - Aug 24 , 2026 | 11:13 AM
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ప్రతిరోజూ ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. కొంతకాలం కెరీర్ సాగాక తమ వృత్తులను మార్చుకోవడం ఇక్కడ సర్వ సాధారణమైన విషయం
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ప్రతిరోజూ ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. కొంతకాలం కెరీర్ సాగాక తమ వృత్తులను మార్చుకోవడం ఇక్కడ సర్వ సాధారణమైన విషయం. అసిస్టెంట్ డైరెక్టర్లు హీరోలుగా మారడం.. సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్లు దర్శకులుగా ప్రయాణం ప్రారంభించడం చూశాం. కానీ, ప్రస్తుతం కోలీవుడ్‌లో (Kollywood) ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే.. యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ దర్శకులు కూడా నటన వైపు అడుగులు వేస్తూ హీరోలుగా మారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు.
ఈ ట్రెండ్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రదీప్ రంగనాథన్ గురించి. 2019లో జయం రవి హీరోగా వచ్చిన 'కోమాళి' సినిమాతో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకుని విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత తాను స్వయంగా దర్శకత్వం వహిస్తూ, 'లవ్ టుడే' అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్', 'డ్యూడ్' వంటి వరుస చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఘనవిజయం సాధించడంతో ప్రదీప్‌కి ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే, ఆ తర్వాతి కాలంలో వచ్చిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఈ వరుసలో చెప్పుకోవాల్సిన మరో ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj). 'మానగరం' సినిమాతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన లోకేష్, ఆ తర్వాత కార్తీతో 'ఖైదీ' తీసి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమానే 'లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)'కు బలమైన పునాదిగా మారింది. ఖైదీ తర్వాత మాస్టర్, విక్రమ్, లియో, కూలీ వంటి భారీ హిట్ చిత్రాలతో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచాడు. అయితే, ఇటీవల దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన డీసీ (DC) సినిమాతో లోకేష్ కనగరాజ్ నటుడిగా, హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, లోకేష్ లోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.
ఇదే కోవలోకి వచ్చే మరో యంగ్ సెన్షేషన్ అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) కూడా చేరుతాడు. గత సంవత్సరం టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా వార్తల్లోకి వచ్చిన ఈ యంగ్ డైరెక్టర్ ఆపై మరో సినిమా దర్శకత్వం వహించే లోపూ హీరోగా విత్ లవ్ (With Love) అనే సినిమాలో నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ సైతం సొంతం చేసుకుని మరో చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఇలా కోలీవుడ్‌లో దర్శకులు నటన వైపు అడుగులు వేసి, భారీ విజయాలు సాధించడం ఇప్పుడు ఒక సర్వసాధారణమైన ట్రెండ్‌గా మారుతోంది. ప్రదీప్ లేదా లోకేష్‌లను చూస్తే.. కేవలం రూపం లేదా ఆహార్యంతో నేరుగా హీరోలయ్యారని చెప్పలేం. కానీ, వారికి వచ్చిన అవకాశాలను సరైన సమయంలో ఉపయోగించుకున్నారు. వారి ప్రతిభకు అదృష్టం కూడా తోడైంది.
అయితే.. ఇలాంటి ప్రయోగాలు తమిళంలో ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, మన తెలుగు సినిమాల్లో ఇకరిద్దరి విషయంలో మినహా ఈ రకమైన మార్పు ఎక్కువగా కానరావట్లేదు. కాగా.. ఇప్పటికే తెలుగులో విశ్వక్ సేన్ ఆరేండ్ల క్రితమే ఫలక్‌నుమా దాస్ వంటి చిత్రం డైరెక్ట్ చేసి హిట్ కొట్టగా తాజాగా కల్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పుడు రామ్, కిరణ్ అబ్బవరం వంటి స్టార్స్ హీరోలుగా నటిస్తూనే స్వయంగా దర్శకత్వంలోకి దిగారు. ఇదే కోవలో భవిష్యత్తులో నవీన్ పొలిశెట్టి, సిద్దూ జొన్నలగడ్డ వంటి వారు సైతం ఎనీ టైం దర్శకులుగా రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు.