Vishal: ఈ మూవీ క్లైమాక్స్ మరే చిత్రంలో చూసి ఉండరు.. చివరి 8 నిమిషాలు అద్భుతం
ABN, Publish Date - Aug 09 , 2026 | 06:25 PM
కెమెరా ముందు, వెనుక పని చేయడం సవాల్‌తో కూడుకున్న పని అని హీరో విశాల్ అన్నారు.
కెమెరా ముందు, వెనుక పని చేయడం సవాల్‌తో కూడుకున్న పని అని హీరో విశాల్ (vishal) అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం మకుటం (makutam). ఈనెల 14న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ (Super Good Films)పై నిర్మితమైన 99వ చిత్రం. విశాల్, అంజలి, దుషార విజయన్ జంటగా నటించిన ఈ చిత్రంలో జాన్ విజయ్, జయప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబు సలీం, ఆర్జే, వీజే ఝాన్సీ, పదమ్ కుమార్ తదితరులు నటించారు. దిగ్గజ నిర్మాత దివంగత ఆర్ బీ చౌదరి సమర్పణలో నిర్మాతలు బి.సురేష్, ఆర్బీ జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ స్వయంగా స్క్రీన్ ప్లే అందించడంతో పాటు తొలిసారి దర్శకత్వం చేశారు. రిచర్డ్ ఎం.నాథన్, అభినందన్ రామానుజం ఛాయాగ్రహణం అందించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీత స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల చెన్నైలో జరిగింది.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. 'ఒక వైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా కెమెరా ముందు, వెనుక ద్విపాత్రా భినయం చేయడం చాలెంజ్‌తో కూడుకున్నపని. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ ఎంతగానో సహకరించారు. నేను చెప్పింది చాలా ఓపిగ్గా విని, కెమెరా ముందు అద్భుతంగా నటించారు. అందుకే ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో దర్శకుడు కావాలన్న 35 యేళ్లనాటి కల ఫలించింది. నన్ను ప్రోత్సహించి, నా కలను నిజం చేసి నందుకు మా నాన్నకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయనకు రుణపడి ఉంటా. సండైకోళి (పందెం కోడి) తీయడానికి కారణం మా తల్లి. నాన్నతో పోట్లాడి ఆ సినిమాను నిర్మించారు. ఆర్బీ చౌదరి పరిచయం చేసిన 45వ దర్శకుడిని నేను.
ఈ సందర్భంగా నా గురువు, యాక్షన్ కింగ్ అర్జున్‌కు ధన్యవాదాలు. ఆయన వద్ద చాలా నేర్చుకున్నా రాంగోపాల్ వర్మ 'ఉదయం' (తెలుగులో 'శివ) సినిమా చూశాక నేను దర్శకుడిని కావాలని అనుకున్నా. మన కలల పట్ల మనకు నమ్మకం ఉంటే అవి తప్పకుండా ఫలిస్తాయి. ఇది కేవలం నాకు మాత్రమే కాదు.. ప్రతి రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. కొత్త దర్శకులకు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఒక వరం. ఈ సిని మాకు ప్రాణం పోశారు. ఈ మూవీలోని క్లైమాక్స్ మరే ఇతర చిత్రంలో చూసి ఉండరు. సినిమా చివరి ఎనిమిది నిమిషాలు అద్భుతంగా ఉంటుంది. నా అభిమాన నటుడు విజయ్ ఇపుడు రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నారు. సినిమా అంటే నాకు అమితమైన ప్రేమ. ఈ సినిమాను నాకు ఇష్టమైన రోహిణి థియేటర్‌లో చూస్తా. ఇందులో ఇళయరాజా సంగీతాన్ని ఉపయోగించా. ఆయనకు ధన్యవాదాలు. ఈ నెల 16న ఈ చిత్రం విజయోత్సవంలో మరోసారి కలుస్తా. ఆ రోజు అనేక విషయాలు చెబుతాను అని అన్నారు.